'బీజేపీనే అడిగింది, ప్రజలు క్షమించరు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నెల్లూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగిందని గుర్తు చేశారు.
కానీ, ఇప్పుడు బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తనట్లు వ్వవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు క్షమించరని అన్నారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని తెలిపారు.

ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీ మళ్లీ రాజకీయ లభ్ది కోసమే ప్రధాని మోడీకి లేఖ ఇచ్చారన్నారు.
ఆరోజు కూడా రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని, అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కోటి సంతకాలంటూ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నారు. ఇక భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై కొన్ని అభ్యంతరాలున్నాయన్నారు.












Click it and Unblock the Notifications