
సుప్రీంలో విభజన పిటిషన్లు-కేసీఆర్-జగన్ మైండ్ గేమ్ ! బీజేపీ-జనసేన డౌట్లు ఇవే ?
ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి ఏపీని ఏపీ-తెలంగాణగా విభజించాలని కోరుతూ వచ్చిన డిమాండ్ల మేరకు కేంద్రం విభజన ప్రక్రియ చేపట్టింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడం, సంక్షిష్టమైన అంశం కావడంతో సుప్రీంకోర్టు కూడా దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టాలని భావించి పక్కనబెట్టింది. అయితే ఇన్నాళ్లకు అప్పట్లో దాఖలైన 30 ప్లస్ పిటిషన్లపై విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు చెప్పేశాయి. అయితే ఇవి ఇరు రాష్ట్రాల్లో రాజకీయంగా కాక రేపుతున్నాయి.

సుప్రీంకోర్టులో విభజన పిటిషన్లు
ఉమ్మడి ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఏపీలో అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ ఫైలు కదిలింది. దీంతో సుప్రీంకోర్టు ఆయా పిటిషన్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వివరణ కోరింది. దీనిపై స్పందించిన రెండు ప్రభుత్వాలు ఎప్పుడో ముగిసిపోయిన విభజన సబ్జెక్టుపై ఇప్పుడు విచారణ అవసరం లేదని తేల్చిచెప్పేశాయి. దీంతో ఈ వ్యవహారం ముగిసిపోయినట్లేనని భావిస్తున్న తరుణంలో భారీ ట్విస్ట్ ఎదురైంది.

జగన్ ను ప్రశ్నించిన ఉండవల్లి
విభజనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వాదన వినిపించడంతో వీటిలో పిటిషనర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన రాష్ట్ర సీఎం అయిన వైఎస్ జగన్ ను దీనిపై ప్రశ్నించారు. జగన్ ఇప్పుడు విభజనకు అభ్యంతరం లేదని చెప్పడమేంటని నిలదీశారు. జగన్ పోరాటం మర్చిపోయారంటూ చురకలు కూడా అంటించారు. దీంతో ఉండవల్లి వ్యాఖ్యలు వైసీపీ సర్కార్ ను ఎక్కడో తాకాయి.

ఉండవల్లికి సజ్జల కౌంటర్
ఏపీ విభజన పిటిషన్ల వ్యవహారంలో ఉండవల్లి చేసిన ఆరోపణలతో ఇరుకునపడిన జగన్ సర్కార్ ను కాపాడేందుకు సజ్జల రంగంలోకి దిగారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భమని, తాము విభజనకు అనుకూలం కాదని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాలూ కలిపేస్తామంటే తమకు అభ్యంతరం లేదని తెల్చిచెప్పేశారు. జగన్ ఎప్పటికీ సమైక్య వాదేనని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో సమైక్య వాదనే వినిపిస్తామంటూ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా తెలంగాణ కోర్టుకు చేరింది.

సజ్జలకు తెలంగాణ నుంచి కౌంటర్లు
ఏపీ-తెలంగాణను కలిపేందుకు వచ్చే ప్రతిపాదనకు మద్దతు తెలుపుతామంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ నుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేత అర్వింద్ వంటి వారు కూడా సజ్జల వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. టీఆర్ఎస్ కు మద్దతుదారైన సీపీఐ నారాయణ కూడా సజ్జల వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెడుతూ సమైక్య వాది అని జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. దీంతో ఏపీ తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా కేసీఆర్-జగన్ కలిసే ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జగన్-కేసీఆర్ మైండ్ గేమ్ ?
ఏపీ విభజన చట్టంపై సుప్రీంకోర్టులో దాదాపు ఒకే అభిప్రాయం వినిపించిన జగన్-కేసీఆర్ ఇప్పుడు దానిపై పడుతున్న కౌంటర్లకు కూడా ఒకేలా స్పందిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ వచ్చే ఎన్నికలకు తమపై ప్రజా వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చి మైండ్ గేమ్ మొదలుపెట్టారని బీజేపీ-జనసేన ద్వయం ఆరోపిస్తోంది. మిగతా విపక్షాలు సైతం ఇదే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. దీంతో జగన్-కేసీఆర్ మైండ్ గేమ్ కారణంగా ఇరు రాష్ట్రాల్లో మిగతా సమస్యలన్నీ ఒక్కసారిగా తెరమరుగు అవుతాయని భావిస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.