టీడీపీ-జనసేనతో పొత్తు ప్రకటనకు బీజేపీకి అడ్డంకి అదేనా ? తాజా ముహూర్తం ఖరారు !
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాయి. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఈ మేరకు బహిరంగ ప్రకటన కూడా చేసేశారు. అయితే ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటన చేసినా కూడా బీజేపీ మాత్రం స్పందించడం లేదు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పి ఊరుకుంటోంది. అయితే తాజాగా బీజేపీ పొత్తులపై ప్రకటన చేసేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన .. ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకు బీజేపీ సిద్ధంగా ఉందా లేదా అన్నది ఇప్పుడే తేలడం లేదు. అలా తేలిపోతే తమకు తెలంగాణ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కాషాయ నాయకత్వం భావిస్తుండమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తుప పెట్టుకుని గత ఎన్నికల్లో నష్టపోయిన కాంగ్రెస్ అనుభవాల నుంచి బీజేపీ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది.

అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఈ ఏడాది డిసెంబర్ లో టీడీపీ-జనసేన కూటమితో తమ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై బీజేపీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోపు ప్రకటన చేస్తే కేసీఆర్ కచ్చితంగా చంద్రబాబును అడ్డుపెట్టి ఆంధ్రా పార్టీ పేరుతో తమను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని కాషాయ సేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ-జనసేనతో పొత్తుపై ఇప్పట్లో ప్రకటన చేసేందుకు బీజేపీ అధిష్టానం ఇష్టపడటం లేదు.
అలాగే తాము టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తమతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అదే టీడీపీని బీజేపీని కలుపుకుపోయే అవకాశం లేకపోతే మాత్రం వెంటనే దీనిపై కాషాయ నేతల నుంచి క్లారిటీ వచ్చేసేదని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ ఎన్నికల్లో నష్టపోకుండా ఉండేందుకు మాత్రమే బీజేపీ చంద్రబాబును కలుపుకుపోవడంపై మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో తమకు బలం ఉన్న స్ధానాల్లో పోటీ చేస్తూ మిగతా చోట్ల బీజేపీకి మద్దతిచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications