పీడీఎఫ్ ప్రకటనను ఖండించమన్నా జనసేన స్పందించలేదు!!
వైసీపీతో బీజేపీ కలిసిపోయిందనే ప్రచారాన్ని ప్రజలు నమ్మబట్టే మండలి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకుడు మాధవ్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీల్లో వేడిని పెంచాయి. భారతీయ జనతాపార్టీ పదాధికారుల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. జనసేన పార్టీ తమతో కలిసి రావడంలేదని ఆరోపించారు. తమకు, జనసేనకు పేరుకు మాత్రమే పొత్తు అన్నట్లుగా ఉందని, దీనివల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందన్నారు.
బీజేపీ దూరం కావాలంటే జనసేన ఇష్టమని, కలిసి ముందుకు వెళదామంటే క్షేత్రస్థాయిలో ఇరుపార్టీలు కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే బీజేపీ-జనసేన పొత్తుపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అభ్యర్థికి జనసేన పార్టీ మద్దతిచ్చిందని పీడీఎఫ్ ప్రచారం చేసిందని, పీడీఎఫ్ చేసిన ప్రకటనను ఖండించాలని జనసేన పార్టీని కోరాంకానీ వారు స్పందించలేదన్నారు.

బీజేపీ.. వైసీపీతో ఉన్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారన్నారు. బీజేపీ అధిష్టానికి అన్నీ చెప్పి చేస్తున్నామంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మినట్లు అర్థమవుతోందన్నారు. వైసీపీ వేసిన అపవాదును తుడిచివేయడానికి ప్రయత్నిస్తామన్నారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జిషీటు వేస్తామన్నారు.
పొత్తుల విషయంలో తమ పార్టీకి పలురకాల ఆలోచనలున్నాయని, పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నాయకుడైన మాధవ్‌కు 10,884 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. శాసనమండలిలో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లుగుదేశం పార్టీ విజయం సాధించి వాటిని కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications