సీఎం జగన్ పై సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు: ప్రజల దౌర్భాగ్యం : 20 తరాల సంపాదన -..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరావతిని కదిలించే వ్యక్తి పుట్టలేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు పరిపాలన తెలియదని..అటువంటి వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలన వికేంద్రీకరణకు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేసారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసారు. మూడేళ్ల కాలంలో జగన్ అధ్వాన్న పాలన అందించారంటూ ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత కక్ష కోసం రాజధాని మార్పు చేస్తాననటం సరైంది కాదని హితవు పలికారు.

ఆ నిధులను మింగేసారు
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన రూ.7 వేల కోట్ల నిధులను సీఎం జగన్ మింగేశారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని.. పుట్టబోయే బిడ్డమీద కూడా అప్పు భారం ఉందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 18 మంత్రిత్వశాఖలకు చెందిన 40 విభాగాల ఏర్పాటు కోసం భూములు కొనుగోలు చేసిందన్నారు. ఆ సంస్థల కార్యక్రమాలను త్వరగా అమరావతి నుంచి ప్రారంభిచేలా ఆ శాఖల మంత్రులను కలిసి కోరుతామని వెల్లడించారు. పంచాయితీల కోసం కేంద్రం కేటాయించిన నిధులను రూ 7,800 కోట్ల నిధులను వారికి అందకుండా మింగేసారని ఆరోపించారు. ఏపీకి రాజధాని ఉండాలని..అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలన్నారు.

అమరావతిని కదలించే శక్తి లేదు
అమరావతి నుంచి రాజధానిని కదిలించేందుకు ఎవరు ప్రయత్నించినా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేసారు. సీఎం జగన్ కు పులివెందుల .. ఇడుపుల పాయ.. హైదరాబాద్ లో ఇళ్లు ఉన్నాయన్నారు. వీటితో పాటుగా బెంగుళూరులో 12 ఎకరాల్లో ప్యాలెస్.. తాడేపల్లిలో ప్యాలెస్ కావాలి..ఇప్పుడు విశాఖలో మరో ప్యాలెస్ కట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇళ్లు కట్టుకోవటం కోసం కేంద్రం ఇస్తున్న రాయితీ ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు. పెద్ద కంపెనీలు నడిపిన యువకుడు ముఖ్యమంత్రిగా వచ్చారని..రాష్ట్రాన్ని అలాగే నడిపిస్తారని భావిస్తే.. జగన్ తన కుటుంబానికి..తన వారికి 20-30 తరాలకు సపరిపడా సంపాదించటం కోసం తన శక్తిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

ఆ ఒక్కటీ మినహా కేంద్ర నిధులే
అమ్మఒడి మినహా రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. అయినా..రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా వారి పేర్లు పెట్టుకోంటోందని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులు సత్యకుమార్ ను సత్కరించారు. 21 ఏళ్లుగా సీఎంగా..ప్రధానిగా ఉన్న మోదీ పైన చిన్న అవినీతి ఆరోపణల లేదన్నారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే 20 తరాలకు సరిపడా సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇక, ఇప్పుడు సత్యకుమార్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు..వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications