టీడీపీపై బీజేపీ నేత ఘాటుగా, బాబు డైనమిక్: నిర్మల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కాదనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం పడిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని చెప్పారు.
చంద్రబాబుకు కేంద్రమంత్రి పొగడ్త
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కితాబిచ్చారు. డైనమిక్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల పార్కును నిర్మలా సీతారామన్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడారు.

ప్రపంచంలో నాణ్యమైన మిర్చి ఇచ్చిన ఘనత గుంటూరు రైతుకు దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా 109 రకాల సుగంధ ద్రవ్యాల పంట విస్తరించి ఉందని, వంకాయలపాడులో 124 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రమోటర్లుగా ఉన్నవారు రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మిరపకాయల ప్యాకింగ్, భద్రత కోసం 18 గోదాములు ఇక్కడే ప్రారంభిస్తామన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తుందన్నారు. 24 గంటలూ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా గోదాములు పని చేస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అన్ని రాయితీలను ఈ పార్కునకు ఇస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మిర్చిలో 65 శాతం గుంటూరువే అన్నారు. గుంటూరు మిర్చి నాణ్యత దేశంలో ఎక్కడ దొరకదన్నారు.
కాగా, 124 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సుగంధ ద్రవ్యాల పార్కు దేశంలో తొమ్మిదవది. ఈ పార్కు ప్రారంభంతో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల స్థాపనలో ముందడుగు పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3వేల మందికి పార్కు ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది.
పట్టిసీమతో ప్రయోజనం లేదు: కావూరి
పట్టిసీమ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివ రావు అన్నారు. నిరుపయోగమైన ఈ ప్రాజెక్టుపై ఏడాదికి రూ.1300కోట్లు ఖర్చు చేయటం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం హామీ ఇచ్చిన తర్వాత ఇలాంటి లిఫ్టు ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications