హీరో శివాజీతో మాకేం సంబంధం: బీజేపీ నేత, టీడీపీపై అసహనం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, హీరో శివాజీ వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబందం లేదని మంగళవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమది నైతిక బాధ్యత అన్నారు.
తాము తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ మిత్రధర్నాన్ని కాపాడుతున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కేంద్రం పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. టీడీపీ పైన హీరో శివాజీ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ.. శివాజీకీ బీజేపీతో సంబంధం లేదన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ నేత, ప్రముఖ నటుడు శివాజీ కొద్ది రోజుల క్రితం షాకిచ్చిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యల పైన హీరో శివాజీ నాడు నిలదీశారు.
ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేయవద్దని, కేంద్రం రూ.10వేల కోట్లు ఇస్తుందని సుజన చెప్పారని, ఎందుకు, ఎలా ఇస్తున్నారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే నాయకులు చరిత్రహీనులు అవుతారని మండిపడ్డారు. సుజన చెప్పిన పదివేల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయో, ఏ రూపంలో వస్తున్నాయో చెప్పాలన్నారు. ఈ నిధులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఏపీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని హితవు పలికారు. అన్ని పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications