వైసీపీ దగ్గరే 2 వేల నోట్లన్నీ-జగన్ సభలకు డ్రెస్ కోడ్ జీవో -బీజేపీ విష్ణుకుమార్ రాజు కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు తాజాగా 2 వేల నోట్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇవాళ విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
ఏపీలోని ఏటీఎంలలో 2 వేల నోట్లు కనిపించడం లేదని, అవన్నీ వైసీపీ నేతల వద్దే ఉన్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దీనిపై ఆర్బీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే ఇందులో వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. మరోవైపు సీఎం జగన్ సభలో మహిళల చున్నీలు తీయించిన ఘటనపైనా విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

సీఎం సభలకు వెళ్లిన మహిళల చున్నీలు తీయించడం కంటే దారుణం ఉంటుందా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు తప్పుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ చర్య సరైనదే అని భావిస్తుంటే సీఎం సభలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ జీవో జారీ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేత శ్రీనివాస వర్మను హౌస్ అరెస్ట్ చేశారని, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఏపీలో మాత్రం బీజేపీ నేతలను జైళ్లలో వేస్తున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.

విశాఖలో దసపల్లా భూముల అక్రమాల వివాదంపైనా విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ వివాదంలో కలెక్టర్‌పై విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే 22ఏ విషయంలో విచక్షణతో వ్యవహరించాలని విష్ణు సూచించారు. రుషికొండ నిర్మాణాలపై దాపరికం ఎందుకని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందులో ఏం జరుగుతుందో బహిర్గతం చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని, దీనిపైనా విచారణ చేయించాలన్నారు.












Click it and Unblock the Notifications