బాబుకు పవన్ కళ్యాణ్ - బిజెపి తలనొప్పి!: కమలంలో రెండుగా...?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం బలవంతపు భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం పైన మిత్రపక్షం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మరో మిత్రపక్షం భారతీయ జనతా పార్టీలో రెండు వర్గాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేవలం రాజధాని విషయంలోనే కాకుండా పలు అంశాల్లోను టిడిపి ప్రభుత్వంపై బిజెపి నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు. కేంద్రం నుంచి నిధులు, ప్రత్యేక హోదా పైన ఇప్పటికే టిడిపి - బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కొన్ని సందర్భాల్లో కనిపించిన విషయం తెలిసిందే.
రాజధాని భూసేకరణ విషయంలోను బిజెపి నేతల్లో భిన్న స్వరాల ఉన్నాయని అంటున్నారు. భూసేకరణ చట్టానికి కొందరు బిజెపి నేతలు సుముఖంగా ఉండగా, మరికొందరు అంతర్గతంగా, బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ప్రభుత్వ భూసేకరణను సమర్థించారు. కొందరు కమలం నేతలు మాత్రం విభేదిస్తున్నారని చెబుతున్నారు. రాజధాని భూసేకరణ విషయంలో స్పందించనప్పటికీ... పలు అంశాల్లో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజు టిడిపి ప్రభుత్వంపై మండిపడ్డారు.

కేంద్రం నిధుల విషయంలో, ఏపీకి 24 గంటల విద్యుత్ విషయంలో పురంధేశ్వరి టిడిపి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో సోము వీర్రాజు అలాగే స్పందించారు. భూసేకరణ విషయంలోను అలాగే ఉన్నారని చెబుతున్నారు.
బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని బిజెపి చెబుతోంది. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం మొదటి నుంచి చెబుతున్నారు. రైతులను ఒప్పించి తీసుకోవచ్చునని చంద్రబాబు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
టిడిపి భూసేకరణ చట్టం పైన పవన్ కళ్యాణ్ నిలదీతను పలువురు బిజెపి నేతలు సమర్థిస్తున్నారని చెబుతున్నారు. రైతులను ఒప్పిస్తే తప్ప, బలవంతంగా తీసుకోవద్దన్న పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, తాము అదే విషయం చెబుతున్నామని బిజెపి నేతలు అంటున్నారు.
అయితే, బహిరంగంగా మాత్రం బిజెపి నేతలు ఇప్పటికిప్పుడు మాట్లాడలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ముందు ముందు టిడిపికి బిజెపి-జనసేన తలనొప్పిగా మారే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.












Click it and Unblock the Notifications