హోదాపై బీజేపీ ఎమ్మెల్యే సంచలనం, ముద్రగడ తిట్లపై కాపు చైర్మన్ సవాల్
అమరావతి: ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అంశమని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కేంద్రం ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వనుందని ఆయన వెల్లడించారు.
తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు (కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్) ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలలో విశ్వసనీయత లేదన్నారు. ప్రత్యేక హోదా అంశం మాత్రం చచ్చిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీ పైన ప్రత్యేక దృష్టి సారించిందని అభిప్రాయపడ్డారు.

ముద్రగడకు కాపు కార్పోరేషన్ చైర్మన్ సవాల్
నిరసన దీక్ష విరమణ సమయంలో తనను, భార్య, కోడలిని పోలీసులు బూతులు తిట్టినట్లు కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారని, వాటిని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సవాల్ విసిరారు.
తుని విధ్వంసం తర్వాత వారం రోజులు ఇంట్లో దీక్ష చేశాక కాపుల్లో విశ్వసనీయత కోల్పోయిన ముద్రగడ పోలీసులు తిట్టారంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తిట్టినట్లు ఆయన నిరూపించుకొనేందుకు కోరిన జడ్జితో విచారణ చేయిద్దామా అన్నారు.












Click it and Unblock the Notifications