కాషాయ గూటికి వైసీపీ మాజీల క్యూ ? లోకేష్ సలహా అడిగిన బీజేపీ ఎమ్మెల్యేలు..!
ఏపీలో తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నడూ లేనంత దారుణంగా ఓటమిపాలైన వైసీపీ నుంచి పలువురు నేతలు అధికార కూటమిలోకి ఫిరాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూటమిలో భాగమైన బీజేపీకి కూడా చేరిక ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటిని ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రి నారా లోకేష్ ముందుంచారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా వీరు లోకేష్ తో దీనిపై చర్చించారు.
బీఆర్ అంబేద్కర్ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా పలువురు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ లోకేష్ దృష్టికి తెచ్చారు. వీరి విషయంలో ఏం చేద్దామని ఆయన్ను అడిగారు. వైసీపీ నుంచి వచ్చే నేతలపై కూటమిలో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని లోకేష్ కు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా.. ఆయన అందుకు సరేనన్నారు. కూటమిలో పార్టీలకు అభ్యంతరం లేని వారిని తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పలువురు వైసీపీ నేతలు తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా తాము మాత్రం చేరికలపై తొందరపడటం లేదని లోకేష్ కు బీజేపీ ఎమ్మెల్యేలు వివరించారు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు నుంచి ప్రతిపాదన వచ్చినా ఇంకా పార్టీలో దీనిపై చర్చించలేదన్నారు. కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఇలాంటి చేరికలపై తొందరపడటం లేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీంతో కూటమిలోకి చేరికలపై వైసీపీ మాజీలు చేస్తున్న ప్రయత్నాలపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications