ఏపీలో పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలిస్కోప్; ఆ ఐపీఎస్ లపై బీజేపీఎంపీ సీఎం రమేష్ సంచలనం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఏపీ పోలీస్ వ్యవస్థపై టెలిస్కోప్ తో నిఘా పెట్టి మరీ చూస్తోంది అంటూ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయడం దిశగా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.

ఏపీలోని కొందరు ఐపిఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేసే అవకాశం
నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అవసరమైతే కొందరు ఐపిఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన వ్యాఖ్యలతో పోలీస్ వ్యవస్థ లోని కొందరికీ హెచ్చరికలు జారీ చేశారు.

పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదన్న ఎంపీ సీఎం రమేష్
పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయని, వ్యవస్థలు ముఖ్యమనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని, అవసరమైతే కొందరు ఐపిఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేస్తుందంటూ పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే రాజ్యాంగం అలాంటి వెసులుబాటును కేంద్రానికి కల్పించిందని సీఎం రమేష్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందనేది చూశామని, ఏపీలో కూడా భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని సీఎం రమేష్ పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతిపై ఈనెల 28వ తేదీన బీజేపీ సభ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి కార్యక్రమాలపై ఈనెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని వెల్లడించారు సీఎం రమేష్. ఇంతకాలం బిజెపి, తొలిసారి జగన్ సీఎం అయ్యారు కాబట్టి, నెమ్మదిగా అర్థం చేసుకుంటారని కొంత కాలం సమయం వేచి చూసిందని, కానీ ఇకముందు వేచి చూసే ధోరణి ఉండబోదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా విధ్వంసకర విధానాలను అవలంభిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో సమస్యలను ఏకరువు పెట్టిన ఎంపీ ..లిక్కర్ పై శ్వేతపత్రం విడుదల డిమాండ్
రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, రాష్ట్రంలో ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని, సిమెంటు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని, నిత్యావసర వస్తువులు అయితే సరేసరని జగన్ సర్కార్ ను బిజెపి ఎంపీ సిఎం రమేష్ టార్గెట్ చేశారు.ఏపీ ప్రభుత్వం మద్యం ద్వారా వస్తున్న ఆదాయం పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. మద్యపాన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు .దశలవారీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదని సీఎం రమేష్ అసహనం వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల రేట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా ?
ఏపీ లో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్రం ఇచ్చే నిధులతో చేస్తున్నారని, ఏపీలో గ్రామ సచివాలయాలను కేంద్ర నిధులతో నిర్మించారని, కేంద్రం ఇచ్చే నిధులను వాడుకొని తామేదో ప్రజలకోసం చేస్తున్నామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు సినిమా టిక్కెట్ల రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు బిజెపి ఎంపీ సీఎం రమేష్. పొరుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఎంత ఉన్నాయి? అక్కడి విధానమేంటో చూడకుండా.. కావాలని ఎవరినో దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకు వెళితే సినిమా థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని సీజ్ చేయిస్తారా అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారు.
Recommended Video

ప్రభుత్వ తీరు దారుణం .. త్వరలో ఏపీ పోలీస్ శాఖలో మార్పులు
ప్రభుత్వ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడిన సీఎం రమేష్ కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి ఇంతకాలమైనా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లలో స్టీల్ ఉత్పత్తి చేస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు సీఎం రమేష్. త్వరలో ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి పెద్ద ఎత్తున సభ నిర్వహించి, సమర శంఖాన్ని పూరిస్తుందని సీఎం రమేష్ వెల్లడించారు. ముఖ్యంగా త్వరలో పోలీసు వ్యవస్థలో కేంద్రం జోక్యంతో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications