వైసీపీ సంకట స్థితి: రాజ్యసభలో ఆ సున్నిత అంశం: టీడీపీ, బీజేపీ ఎంపీల అటాక్
అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాబోతోంది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించబోతోంది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు జీరో అవర్ నోటీస్ ఇచ్చారు. పెద్దల సభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉండటం, దీనిపై తెలుగుదేశం పార్టీ వారికి మద్దతు ఇవ్వబోతోండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకట స్థితిని ఎదుర్కొనడానికి అవకాశం ఉందని అంటున్నారు.
నిమ్మగడ్డ ఆదేశాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఈ ఐఎఎస్‌పై చర్యలకు: ఎస్ఈసీకి రిప్లయ్
దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో తెలుగుదేశం నేతల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాన్ని వైసీపీ సభ్యులు ప్రస్తావనకు తీసుకుని రావడం ద్వారా కౌంటర్ అటాక్ చేస్తుందని తెలుస్తోంది. విగ్రహాల విధ్వంసం ఘటనలకు పాల్పడిన వారిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించబోతోన్నట్లు జీవీఎల్ నరసింహా రావు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడికి నోటీసులను ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయంలో టీడీపీ మద్దతు తమకు ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

నోటీసు ఇచ్చిన సభ్యుడు మాత్రమే జీరో అవర్‌లో సంబంధిత అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బీజేపీ,, టీడీపీకి చెందిన మిగతా సభ్యులు కూడా తమ గళాన్ని వినిపించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. జీవీఎల్‌తో పాటు బీజేపీకే చెందిన సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ దీనిపై మాట్లాడే అవకాశాన్ని కోరుతారని తెలుస్తోంది. ఈ దాడుల వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలడం వల్ల కనకమేడల నుంచి స్పందిస్తారనేది తేలాల్సి ఉంది.
రాజ్యసభలో ఆరుమంది సభ్యుల బలం ఉన్న వైఎస్సార్సీపీ.. ఈ అంశాన్ని ఎలా తిప్పి కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సభ్యుల ఆరోపణలపై ఎదురుదాడి చేయడానికి విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యా రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని.. పోలీసుల దర్యాప్తు నివేదికలను ఆధారంగా చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నేతల ప్రమేయం ఉందనడానికి సాక్ష్యాధారాలుగా పోలీసులు సేకరించిన నివేదికల క్లిప్పింగులతో వారు కౌంటర్ అటాక్ చేసేలా వ్యూహాన్ని రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.