వైసీపీ, టీడీపీలకు బీజేపీ మరో అగ్ని పరీక్ష ? 2024 ఎన్నికలకు రిహార్సల్ !
ఏపీలో బీజేపీకి కొత్త, పాత మిత్రులైన వైసీపీ, టీడీపీకి ఇప్పుడు మరో పరీక్ష ఎదురుకాబోతోంది. 2019లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అప్పటికే టీడీపీ వదిలేసిన బీజేపీ.. అధికార పార్టీకి దగ్గరైంది. అదే సమయంలో ఎన్నికల్లో ఓడి జ్ఞానోదయం అయ్యాక టీడీపీ సైతం బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో బీజేపీ మద్దతు, సాయం ఎవరికి అన్న అంశంపై ఇప్పటికే చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ తమ విధేయతల్ని నిరూపించుకునేందుకు బీజేపీ మరో అవకాశం ఇవ్వబోతోంది. అదీ ఏపీకి ఏమాత్రం సంబంధం లేని ఢిల్లీ సేవల అంశంలో. ఢిల్లీపై పెత్తనం ఎవరికి ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ముందుగా రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. దీనికి వైసీపీ, టీడీపీ ఎంపీలు మద్దతివ్వాల్సిన పరిస్ధితి ఉంది.

రాజ్యసభలో బీజేపీతో పాటు ఎన్డీయే ఎంపీల బలం 110 మాత్రమే. అలాగే విపక్షాల మొత్తం బలం 128. అయితే వీరిలో యూపీయే పక్షాలకు 64 ఎంపీలున్నారు. మరో 64 ఎంపీల్లో వైసీపీ, టీడీపీ, బీజేడీతో పాటు పలు పార్టీలున్నాయి. వీరిలో వైసీపీకి 9, బీజేడీకి 9 ఎంపీలున్నారు. అలాగే టీడీపీకి ఓ ఎంపీ ఉన్నారు. అంటే వైసీపీ, టీడీపీలకు కలిపి 10 మంది ఎంపీలున్నారు. వీరి మద్దతు కోసం బీజేపీ తప్పకుండా ప్రయత్నిస్తుంది. అలాగే వీరు కూడా మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువ.
గత నాలుగేళ్లలో కేంద్రం పార్లమెంటులో పెట్టిన వ్యవసాయ బిల్లులు సహా పలు కీలక బిల్లులకు వైసీపీ, టీడీపీ అండగా నిలిచాయి. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కేంద్రం అడక్కుండానే మద్దతిచ్చాయి. కానీ ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ, టీడీపీ వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు బీజేపీకి మద్దతిస్తే అది మిగతా పార్టీలకు వరంగా మారుతుంది. దీంతో ఈ రెండు పార్టీలకు ఈ బిల్లు పరీక్ష పెట్టబోతోంది.












Click it and Unblock the Notifications