కూకట్‌పల్లి ఐడిఎల్ కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కంపెనీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన 8మంది కార్మికులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
డిటోనేటర్లు తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు తెలిసింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సంభవించడంతో కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కంపెనీకి సంబంధించిన వారిని తప్ప, మిగిలిన వ్యక్తులను, మీడియాను కూడా కంపెనీ యాజమాన్యం లోనికి అనుమతించడం లేదు.
ఐడిఎల్ కంపెనీలో గతంలో కూడా ఇదే కంపెనీలో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ కంపెనీలో తరచూ పేలుళ్లు సంభవిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, తమకు భద్రత లేదని చాలాసార్లు కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. యాజమాన్యం తగిన రక్షణ చర్యలు చేపట్టనట్లు తెలుస్తోంది. కాగా, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications