ఇదే ఫస్ట్ కాదు, కాపులకు అన్యాయం కామన్: బాబు-దేవినేనిపై బోండా షాకింగ్
అమరావతి: తనకు ఓ ముఖ్య నేత వల్లనే మంత్రి పదవి రాలేదని బోండా ఉమామహేశ్వర రావు పరోక్షంగా మంత్రి దేవినేని మహేశ్వర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విస్తరణలో తనకు పదవి వస్తుందని ఆయన భావించారు. కానీ రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఓ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు కేశినేని నాని, కొణకళ్ల నారాయణలు ఆయనను బుజ్జగించారు. ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత బొండా ఉమ మెత్తపడ్డారు.

కాపులకు అన్యాయం కామన్‌గా మారింది.
అయితే, సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తనకు పదవి రాకుండా ఓ ముఖ్య నేత అడ్డుకున్నారని చెప్పారు. ఫలితాలు రావాల్సిన సమయంలో రాలేదన్నారు. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్లుగా జరగవని చెప్పారు. కాపులకు అన్యాయం జరగడం ఇదే తొలిసారి కాదని, ఇది మాకు కామన్ అయిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం తనకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు. అయినా చంద్రబాబు చెప్పింది శిరసా వహిస్తానని చెప్పారు.

మచ్చలేకుండా పని చేసినా..
సామాజిక సమీకరణాల వల్లే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. తాను చీఫ్ విప్‌గా పని చేస్తానని చెప్పారు. తాను ఎలాంటి మచ్చ లేకుండా పని చేసినా ఉద్వాసన తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శివాజీ రాజీనామాపై గౌతు శిరీష
పార్టీకి ద్రోహం చేసే కుటుంబం కాదని జిల్లా టిడిపి నేత గౌతు శిరీష అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నిర్ణయం శిరోధార్యం అన్నారు. గౌతు శివాజీకి మంత్రి పదవి రాలేదన్న బాధ ఉందని, తాము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
మంత్రివర్గంలో ముస్లిం, గిరిజనులకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. కేబినెట్ విస్తరణలో కులసమీకరణాలకు పెద్దపీట వేసి ముస్లిం, గిరిజనులకు మాత్రం అన్యాయం చేశారన్నారు. అలాగే ఫిరాయింపుదారులకు కేబినెట్‌లో స్థానం కల్పించి రాజ్యాంగస్ఫూర్తికి చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారన్నారు. దీనిపై గవర్నర్ కూడా అభ్యంతరం చెప్పకపోవడం బాధాకరమన్నారు.

నిరసనగా రాజీనామాలు
మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమ ఎమ్మెల్యేకు కేబినెట్ పదవి దక్కకపోవడంతో పెనుకొండలోని టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీకే పార్థసారధికి మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటి వర్గీకరణలోనే తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందనుకున్న తమకు అప్పట్లో నిరాశ ఎదురయిందని.. కానీ, ఇప్పుడు దాదాపు ఖరారైపోయిందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైందని వాపోతున్నారు.
తమ ఎమ్మెల్యే పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామాలు చేశారు. అనంతపురం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి దండు ఈశ్వరప్రసాద్, సోమందేపల్లి మండలాధ్యక్షురాలు దాసరి వరలక్ష్మి, పాలసముంద్రం ఎంపీటీసీ శారదాబాయి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి కంటే ముందు పెనుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, రొద్దం సింగిల్ విండో ప్రెసిడెంట్ టైలర్ ఆంజినేయులు, పరిగి ఎంపీపీ సత్యనారయణలు తమ పదవులకు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications