కుట్రనే: ముద్రగడ కాపు గర్జనపై విరుచుకుపడ్డ బొండా ఉమా
హైదరాబాద్: ఈ నెల 31న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు నేతలు నిర్వహించ తలపెట్టిన ‘కాపు గర్జన' సభను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు శనివారం మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు.
ఏ ప్రయోజనాలు ఆశించి గర్జనలు పెడుతున్నారో కాపు పెద్దలు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. జీవోల ద్వారా కులాలకు రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేశాయని, ఇతర బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను బీసీల్లో చేర్చాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బోండా వివరించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాపులకు మేలు జరగలేదన్నారు. కాపులు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉన్నందు వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్ర పన్నుతోందని బోండా ఆరోపించారు.

ఫ్లీట్ రివ్యూను విజయవంతం చేయండి
విశాఖపట్నంలో జరుగనున్న ఫ్లీట్ రివ్యూను విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఏపీ మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. 51 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు ప్రముఖులు హాజరవుతారని ఆయన శనివారం విశాఖపట్నంలో చెప్పారు. వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
కామినేనికి పరామర్శ
ఏపీ మంత్రి కామినేని ప్రజలకు మంచి సందేశం ఇచ్చారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కామినేని నిర్ణయం ఆదర్శమని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కొనియాడారు. ప్రజాప్రతినిధులంతా ఈ పద్దతి పాటిస్తే మంచిదన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కామినేనిని డిప్యూటీ సీఎం కేఈ, మంత్రి పల్లె పరామర్శించారు.
12 నుంచి కృష్ణా పుష్కరాలు
ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణాపుష్కరాలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన ఆవాంఛనీయ సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
అదే విధంగా 172 కొత్త ఘాట్లు నిర్మిస్తామన్నారు. ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మాణిక్యాలరావు తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు గాను దేవాదాయ శాఖలో ఫిర్యాదు స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు.












Click it and Unblock the Notifications