జగన్ హిందూ వ్యతిరేకి అంటూ రచ్చ ; ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలతో జగన్ కు బూమరాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ను ముఖ్యంగా హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చెయ్యటంతో ఈ విషయంపై రగడ నెలకొంది.

వినాయక చవితి ఉత్సవాలపై జగన్ నిర్ణయం .. ప్రతిపక్షాల టార్గెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించడానికి వీలు లేదని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జగన్ ను ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసే దాకా వెళ్లింది. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాలలో జగన్ హిందూ వ్యతిరేకి అని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు కరోనా మహమ్మారి సాకుగా చూపి బహిరంగ వేదికల మీద నిర్వహించుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోమారు జగన్ ను టార్గెట్ చెయ్యటానికి ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఆ అవకాశాన్ని జగన్ స్వయంగా ఇచ్చారని తెలుస్తుంది.

వైసీపీ పార్టీ కార్యక్రమాలకు,మద్యం అమ్మకాలకు అడ్డు రాని కరోనా .. వినాయక చవితికేనా : లోకేష్
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా వినాయక చవితి ఉత్సవాల విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. వైసిపి పార్టీ కార్యక్రమాలకు, జగన్ కుటుంబ కార్యక్రమాలకు, మద్యం అమ్మకాలకు, అడ్డురాని కరోనా వినాయక చవితి వేడుకలను అడ్డు వచ్చిందా అంటూ గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలను ప్రశ్నిస్తూ నారా లోకేష్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. మత విద్వేషాలు రేపేందుకే వినాయక చవితి ఉత్సవాలను జగన్ రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

విఘ్నాలు తొలగించే వినాయకుడికే విఘ్నాలా : లేఖలో లోకేష్
కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వేయడం, కరోనా నిబంధనల అమలులో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా ఇళ్లలోనే పూజలు జరుపుకోవాలని చెప్పడం సరికాదని నారా లోకేష్ ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విఘ్నాలు తొలగించే వినాయకుడికే విఘ్నాలు కల్పించడం మంచిది కాదని లోకేష్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలపై ఏ రాష్ట్రంలో పెట్టని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టడానికి గల కారణాలు ఏమిటి అని లోకేష్ ప్రశ్నించారు.

మీ 25 వ వివాహ వేడుకలకు నో కరోనా .. కానీ ఇప్పుడెందుకు
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిపారని, అన్ని నియోజకవర్గాల్లో కనీసం కరోనా నిబంధనలు పాటించకుండా వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారని, భారీ జన సమీకరణతో వర్ధంతి జరిపారని లోకేష్ పేర్కొన్నారు. అంతేకాదు మీ 25వ వివాహ వార్షికోత్సవాలకు కరోనా అడ్డు రాలేదు కదా అని పేర్కొన్న లోకేష్ అప్పుడు అడ్డురాని కరోనా వినాయక చవితికి మాత్రం అడ్డు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు జరుపుకోనివ్వండి అంటూ నారా లోకేష్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

జగన్ హిందూ వ్యతిరేకి ... మళ్ళీ మొదలుపెట్టిన ప్రతిపక్షాలు
ఇదే సమయంలో జగన్ హిందూ వ్యతిరేకి అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ప్రచారం మొదలుపెట్టారు. చర్చిలు, మసీదులు నిర్వహించుకోవడానికి లేని కరోనా ఇబ్బంది, రాజకీయ సభలు పెట్టి గుంపులుగుంపులుగా జనాన్ని పోగు చేస్తే రాని కరోనా అడ్డంకి , వైసీపీ నేతల సభలకు లేని కరోనా సమస్య హిందువులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తే వస్తుందా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. వినాయక చవితి మండపాలకు అనుమతి లేదని, పూజా సామాన్లు కొనుగోలు చేసే దగ్గర భౌతిక దూరం తప్పనిసరని, గుంపులుగుంపులుగా తిరగవద్దు అని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న జగన్ ప్రతి ఆదివారం చర్చిలలో ప్రార్థనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు కరోనా రాదా అని ప్రశ్నిస్తున్నారు.

జగన్ నిర్ణయమే ఆయుధంగా టీడీపీ, బీజేపీ దాడి .. జగన్ కు బూమరాంగ్
వినాయక చవితి ఉత్సవాల విషయంలో జగన్ సర్కార్ ను, ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మరోమారు జగన్ ని ఇరకాటంలో పెట్టడానికి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయుధంగా వాడుతున్నారు. వినాయక చవితి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనకు బూమరాంగ్ అవుతుంది. ఇది ఏపీ సర్కార్ అనాలోచిత నిర్ణయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బిజెపి నాయకులతో పాటు, తెలుగు తమ్ముళ్లు మరోమారు జగన్ పై గతంలో ఏపీలో జోరుగా చర్చనీయాంశం అయిన హిందూ వ్యతిరేకి ముద్రనే మళ్ళీ మళ్ళీ వేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే సోము వీర్రాజు హిందూ వ్యతిరేక పాలన సాగిస్తున్నారని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు.
Recommended Video

జగన్ వినాయకచవితిపై వెనక్కు తగ్గుతారా ?
బార్లు , మద్యం దుకాణాలు , స్కూళ్ళు, అన్నీ బార్లా తెరిస్తే కరోనా రాదు కానీ వినాయక చవితి వేడుకలు చేస్తేనే కరోనా వస్తుందా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ వినాయకచవితి వేడుకల విషయంలో తీసుకున్న నిర్ణయంపై వెనక్కు తగ్గకుంటే మరింత జగన్ ను, జగన్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించే ప్రమాదం లేకపోలేదు . మరి ఈ నిర్ణయంపై జగన్ వెనక్కు తగ్గుతారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications