
ఒప్పందంలో 'రాజధాని' అనే పదం ఎక్కడుంది??
రైతులతో అప్పటి ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో రాజధాని అనే పదం ఎక్కడుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిపై తమ ప్రభుత్వం ఏనాడూ యూటర్న్ తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉంటామన్నారు.
ఎప్పుడైతే తాము సచివాలయ వ్యవస్థ తెచ్చామో అప్పుడే వికేంద్రీకరణ ప్రారంభమైందన్నారు. అమరావతితోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. మూడు రాజధానులపై తమకు పునరాలోచనే లేదన్నారు. అమరావతిలో నిజమైన రైతులు 5 లేదంటే 10 మంది ఉంటారని, మిగతావారంతా వ్యాపారస్తులన్నారు. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, అవినీతిపరులున్నారని బొత్స అన్నారు.

అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటే బాగుండేదని అప్పటి విపక్ష నేతగా జగన్ చెప్పారని, ఈ విషయమై తాను ఏదైనా మాట్లాడితే ప్రాంతీయ విబేధాలు వస్తాయని జగన్ ఆనాడు వ్యాఖ్యానించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. రాజధాని కోసం తీసుకొనే భూమి ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని జగన్ సూచించారన్నారు. చంద్రబాబు రాజధానిలో ఎందుకు నిర్మాణాలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం ఒక్క అడుగుకు రూ.10వేలను వెచ్చించారని చెప్పారు.