బెంగళూరు మ్యాడ్ సెలబ్రేషన్స్: ఇదే అదనుగా.. !!
ఐపీఎల్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకుంది. వరుసగా రెండో సీజన్ లో కూడా ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జీటీ నిర్ణీత 20 ఓవర్లల్లో 155 పరుగులే చేయగా.. దీన్ని 18 ఓవర్లల్లో అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. 161 పరుగులు చేసింది.
ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. 42 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. విన్నింగ్ స్ట్రోక్ తో మ్యాచ్ ను ముగించాడు. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 32 పరుగులు బాదాడు. చివర్లో టిమ్ డేవిడ్ 24 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. లో స్కోర్ కావడంతో ఆర్సీబీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌షిప్‌ను ఆర్సీబీ కైవసం చేసుకోవడంతో బెంగళూరు నగరం సంబరాల్లో మునిగిపోయింది. ముందస్తు దీపావళిని జరుపుకొంది. పొద్దుపోయేంత వరకూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. క్రాకర్స్ కాల్చారు. నగర వీధులన్నీ కూడా రెడ్ అండ్ గోల్డ్ రంగుల్లోకి మారాయి. "ఈ సాలా నూ కప్ నమ్దు" అంటూ నినాదాలు చేశారు. టపాసులు, పసిడి కాన్ఫెట్టితో నగరమంతా హోరెత్తింది.
మ్యాచ్ ముగియగానే వేలాది మంది అభిమానులు వెంటనే రోడ్లపైకి వెల్లువెత్తారు. ఎం చిన్నస్వామి స్టేడియం, బ్రిగేడ్ రోడ్, ఇందిరానగర్ వంటి కీలక ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. అభిమానులు భారీ జెండాలతో బైక్స్, కార్లలో తిరుగుతూ సంతోషాన్ని పంచుకున్నారు. రాత్రంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వరుస ఛాంపియన్‌షిప్‌లతో చరిత్ర సృష్టించిన తమ జట్టును చూసి పొంగిపోయారు.
అదే సమయంలో భారీగా డ్రంకన్ డ్రైవ్ కేసులు సైతం నమోదయ్యాయి. పలువురు అభిమానులు మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల వ్యవధిలో 260 వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. వీకెండ్ రోజుల్లో సాధారణ కేసుల కంటే ఇది అధికం. వీరిలో చాలామంది ఆర్సీబీ అభిమానులే ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications