చంద్రబాబు నీతిని గాలికొదిలేశారు?: 'గతం గుర్తు చేసి సవాల్ విసిరారు'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తోన్న అభివృద్ధి చేతల్లో కనిపించడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని అన్నారు.
కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉండటం వల్ల ఏపీకి మేలు జరుగుతుందని చెప్తున్న చంద్రబాబు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కేంద్రంలో తనకు పలుకుబడి ఉందని ఏపీ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ఏపీకి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని మండిపడ్డారు.
Also Read: రైల్వేబడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు నిరాశ, బాబుకు 'అమరావతి'పై మోడీ చేయి! ఇవే...
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని, చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలోని మంత్రులు పంచభూతాలను కూడా దోచుకుంటుంటే, చంద్రబాబు మాత్రం సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్నారు.

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చూపించే శ్రద్ధ కేంద్రం నుంచి నిధులు తేవడంలో చూపడం లేదన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలోని హామీలపై చంద్రబాబు దృష్టి పెట్టలేదని అన్నారు.
చంద్రబాబుకు సి.రామచంద్రయ్య సవాల్
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలను దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య సవాల్ విసిరారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
తాను గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సవాల్‌ను స్వీకరించి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యానని అన్నారు.
అదే చంద్రబాబు నేడు చేస్తున్నదేంటీ? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. పట్టీసీమను చంద్రబాబు, థర్మల్ కేంద్రాలను చిన్నబాబుకు ధారాదత్తం చేసుకుని అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications