చంద్రబాబు రా కదలిరా సభలకు బ్రేక్.. కారణమిదే!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రా కదలిరా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన బహిరంగ సభలను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న చంద్రబాబు ప్రస్తుతం ఆ ప్లాన్ కు బ్రేక్ వేసి హైదరాబాదులో కీలక చర్చలలో పాల్గొంటున్నారు.
నిన్నటి నుంచి షెడ్యూల్ కు బ్రేక్ వేసిన చంద్రబాబు టిడిపి జనసేన పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశం పైన తుది చర్చలు జరిపి అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నారు. దాదాపు మూడు రోజులపాటు హైదరాబాద్ లోనే ఉంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలతో కలిసి ఒక నిర్ణయానికి రానున్నారు.

ప్రస్తుతం టిడిపి జనసేన ల మధ్య సీట్ల సర్దుబాటు వివాదాన్ని వైసీపీ టార్గెట్ చేసి రెండు పార్టీల మధ్య సఖ్యత కష్టమేనని, ఇలాంటి వాళ్ళని ఏపీ ప్రజలు విశ్వసించరని ప్రచారం చేస్తున్న వేళ ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికలు కొనసాగుతున్న తరుణంలో, వైసిపి అధినేత వైయస్ జగన్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు.
మొత్తంగా 69 స్థానాలకు వైసీపీ సమన్వయకర్త లను ప్రకటించి ఎన్నికలకు దూకుడును మొదలు పెట్టింది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అభ్యర్థుల అంశాన్ని సీరియస్ గా తీసుకుని రా కదలిరా సభలకు బ్రేక్ చెప్పి అభ్యర్థుల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురానున్నారు. 22 పార్లమెంటు నియోజకవర్గాలలో సభలు నిర్వహించాలని భావించిన చంద్రబాబు ఇప్పటికి 17 నియోజకవర్గాలలో సభలను పూర్తి చేశారు.
ఇక అన్ని సభలను ఈ నెల ఆఖరికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అయోధ్య రామ మందిర పర్యటనతోపాటు ఇతర సమస్యలతో కొన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు అభ్యర్థుల కసరత్తు కోసం మరోమారు రా కదలిరా సభలను వాయిదా వేసి చంద్రబాబు ఆ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నాలుగు, ఐదు తారీకులలో తొలి జాబితాను వెల్లడించాలని ఆలోచిస్తున్న క్రమంలో సభలను వాయిదా వేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications