Coronavirus: కేంద్రానికి చంద్రబాబు లేఖ: అక్కడ 58 మంది తెలుగు ఇంజినీర్లు: సురక్షితంగా స్వదేశానికి.. !
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన అల్లాడుతోన్న చైనాలో ఇరుక్కుపోయిన తెలుగు యువ ఇంజినీర్లను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణియన్ జైశంకర్‌కు వినతిపత్రాన్ని పంపించారు. 58 మంది తెలుగు ఇంజినీర్లు, ఉద్యోగులు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

శ్రీసిటీ టీసీఎల్ ఫ్యాక్టరీ నుంచి..
చిత్తూరు జిల్లా శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో కొనసాగుతోన్న టీసీఎల్ ఫ్యాక్టరీ తరఫున 58 మంది ఇంజినీర్లు ఆప్టో-డిస్‌ప్లే టెక్నాలజీలో శిక్షణ పొందడానికి గత ఏడాది ఆగస్టులో వుహాన్ సిటీకి బయలుదేరి వెళ్లారని చంద్రబాబు ఈ లేఖలో పేర్కొన్నారు. వుహాన్ సిటీలోని ఆప్టో-ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సంస్థలో శిక్షణ పొందుతున్నారని వివరించారు. ప్రస్తుతం అదే నగరంలో కరోనా వైరస్ విజృంభించిందని, ఫలితంగా- ఆయా ఇంజినీర్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

మత్స్యకారులను విడిపించడంలో చొరవ..
వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాలని కేంద్రమంత్రికి విజ్ఙప్తి చేశారు. వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఇదివరకు పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన 20 మంది తెలుగు మత్స్యకారులను విడిపించడంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించిందని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా వుహాన్ సిటీ నుంచి తెలుగు ఇంజినీర్లను తీసుకుని రావాలని అన్నారు.

250 మంది కోసం ప్రత్యేక విమానం..
ఇదిలావుండగా.. వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్‌లో ఉన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. వారిని తీసుకుని రావడానికి ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేస్తామని జైశంకర్ ప్రకటించారు. దీనికోసం చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు.. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనికి అవసరమైన చర్యలు చేపట్టామని, రేపో మాపో స్వదేశానికి చేరుకుంటారని అన్నారు.












Click it and Unblock the Notifications