విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ కీలక నిర్ణయం - పార్టీలో చేరికలు..!!
బీఆర్ఎస్ విశాఖ కేంద్రంగా ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. పార్టీ తొలి సమావేశం నిర్వహించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మూడు రోజులు విశాఖలోనే మకాం వేయనున్నారు.
ఆయనకు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఏపీ బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తోట చంద్రశేఖర్ కి స్వాగతం పలికారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే కుట్రల్నిబీఆర్ఎస్ అడ్డుకుంటుందని తోట చెప్పుకొచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం ప్రధాన అస్త్రంగా ఏపీలో బీఆర్ఎస్ తమ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖ కేంద్రంగా తొలి సమావేశం నిర్వహించింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ, కార్మికులకు అండగా నిలుస్తామని మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు.
ఏపీ బీఆర్ఎస్ నేతలకు స్టీల్ ప్లాంట్ మద్దతు ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. అందులో భాగంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీ నేతలతో కలిసి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వారి పోరాటినికి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకునేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేసారు.
కేంద్రాన్ని ప్రశ్నించటంలో ఏపీ సీఎం జగన్ తో సహా అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు వదులుకుందని తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షం టీడీపీ రెండు కూడా మోదీని ప్రశ్నించరని మండిపడ్డారు.
మోదీ నియంతృత్వ ధోరణితో దేశం అధోగతి పాలు అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యమ్న్యాయ రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్ ఎదుగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తోందని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపాలని పలు పార్టీలు ధర్నాలు చేసి చేతులు దులుపుకున్నాయన్నారు. ఆ ఆతరువాత విశాఖ ఉక్కు గురించి ఏ పార్టీ మాట్లాడడంలేదని ఎద్దేవా చేసారు.
తెలుగు ప్రజలకు బలిదానాలకు ప్రతీకగా విశాఖ ఉక్కు కర్మాగారం నిలుస్తుందన్నారు. పీ ఆస్తుల్ని యధేచ్ఛగా కొల్లగొడుతుంటే రాష్ట్రంలోని పార్టీలు నోరు మెదపడం లేదని, ఒకరితో ఒకరు పోటీ పడుతూ కేంద్ర ప్రభుత్వానికి సాగిల పడుతున్నారని తోట చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు.
ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామని అన్నారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ఉక్కు పరిశ్రమకు కనీసం రుణంగా అయినా అవసరమైన రూ 5వేల కోట్లు ఇవ్వచ్చని వ్యాఖ్యానించారు. విశాఖ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం తీవ్ర తరం చేస్తామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications