KCR BRS: అమరావతా? 3 రాజధానులా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంతిమంగా తన పోరాటం భారతీయ జనతాపార్టీపైనే ఉంటుందని, నరేంద్రమోడీ-అమిత్ షాను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరుణంలో అందుకు కావల్సిన అర్హతలు పొందడానికి దృష్టిసారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓటుబ్యాంకు ఉండాలి.

6 శాతం ఓట్లు తేలిక మార్గం
ఎన్నికల సంఘం నిబంధనల్లో జాతీయ పార్టీగా అవతరించడానికి ఇదొక్కటే తేలికైన మార్గం. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి సులువుగా ఓట్లు సాధించవచ్చని కేసీఆర్ భావనగా ఉంది. ప్రస్తుతం ఆయన కర్ణాటకపై దృష్టిసారించారు. రానున్న ఎన్నికల్లో పోటీచేయడంతోపాటు కుమారస్వామి పార్టీ జనతాదళ్ ఎస్ మద్దతుతో సులభంగా ఆరుశాతం ఓట్లు పొందగలమని కేసీఆర్ భావిస్తున్నారు.

విభజనకు కారకుడు కేసీఆరే
ఏపీకి వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారకుడు కేసీఆరే అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. ఆయన అన్నా, ఆయన పార్టీ అన్నా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఏపీలో పోటీచేస్తారా? అనే సందేహం పలువురిని వెంటాడుతున్నప్పటికీ ఏపీ ప్రజలు కుల రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తుండటం ఆయనకు వరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కేసీఆర్ కు సన్నిహితుడే. గత ప్రభుత్వ హయాంలోరాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తున్నారని, తెలంగాణ తరఫున సహాయ సహకారాలందిస్తామని అప్పటి సభలో ప్రకటించారు. విభేదాలేమీ లేకపోయినా కలిసుందామనే ఉద్దేశంతో తెలుగువారంతా ఉన్నారు. కేసీఆర్ ప్రకటనను వారు కూడా స్వాగతించారు.

3 రాజధానులంటున్న జగన్
తర్వాత ఏర్పడిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులే తమ విధానమని ప్రకటించడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు ఒక విడత పాదయాత్ర చేశారు. మరో విడత పాదయాత్ర చేస్తూ మధ్యలో నిలిపివేశారు. విశాఖ, కర్నూలులోని బహిరంగసభల్లో వికేంద్రీకరణ గురించి మంత్రులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం కీలకంగా మారబోతోంది. తెలుగుదేశం అమరావతి అని, వైసీపీ మూడు రాజధానులంటూ ఎన్నికలకు వెళ్లబోతున్నారు. ఇటువంటి తరుణంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ ఎస్ విధానం ఏమిటి? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమరావతా? మూడు రాజధానులా? అనేదానిపై తన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు సున్నితమైన విషయం
తనకు సన్నిహితంగా ఉన్న మిత్రుడు 3 రాజధానులంటున్నారు.. మరోవైపు తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అమరావతి అంటోంది. ఆ శంకుస్థాపనకు కూడా హాజరయ్యారుకాబట్టి బీఆర్ఎస్ కు ఇది చాలా సున్నితమైన విషయంగా మారింది. ఇప్పటికప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా రాష్ట్రంలో ఒకటి, రెండు బహిరంగసభలు ఏర్పాటుచేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే రాజధానిపై తన వైఖరిని తెలియజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications