గల్లంతైన బీటెక్ విద్యార్థిని మృతదేహం లభ్యం, నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం
అమరావతి: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలవగుంట వద్ద ఎన్టీఆర్ జలాశయంలో శనివారం గల్లంతైన బీటెక్ విద్యార్థిని కీర్తన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. ఈ ఘటనపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరులోని ఎస్వీసెట్ కళాశాలలో కీర్తన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కీర్తన తన స్నేహితుడు పూర్ణతో కలిసి వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా ఎన్టీఆర్ జలాశయం కల్వర్టుపై నుంచి వెళ్తుండగా ప్రవాహానికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ సిబ్బంది ఆదివారం ఉదయం కీర్తన మృతదేహాన్ని వెలికితీశారు. అయితే వాగులో హఠాత్తుగా నీటి ఉధృతి పెరగడానికి కారణం జలాశయం గేట్లు ఎత్తివేయడమేనని అనుమానిస్తున్నారు.

జలాశయాన్ని వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి ఒకరు నీటి ప్రవాహాన్ని వీక్షించేందుకు గేట్లు ఎత్తించినట్లు సమాచారం. దీనివల్లే ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగి దిగువ ఉన్న కల్వర్టుపై నుంచి ప్రవహించడంతో, అదే సమయంలో దానిపై నుంచి వెళుతున్న కీర్తన నీటిలో కొట్టుకుపోయింది.
నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ విద్యార్ధినికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాలశాఖ ఓ లేఖలో పేర్కొంది.
శనివారం నాడు చంద్రబాబును కలిసిన నీలిమను అభినందించి ఆమెకు చెక్ అందజేశారు. నీలిమ స్వస్థలం గుంటూరు జిల్లా తురకపాలెం. గతేడాది ఆమె చేపట్టిన ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమం నేపాల్ భూకంపం కారణంగా మధ్యలో నిలిపివేయాల్సి వచ్చింది.
రెస్క్యూ టీమ్స్ ఆమెను కాపాడటంతో నేపాల్ దుర్ఘటన నుంచి బయటపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నీలిమ తన యాత్రను ప్రారంభించనుంది. తన ఎవరెస్ట్ యాత్రకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నీలిమ హర్షం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications