ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చెయ్యాలి: బుద్ధా వెంకన్న తీవ్రవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త జల్లయ్య దారుణ హత్య టిడిపి నాయకుల ఆగ్రహానికి కారణంగా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జల్లయ్యను ప్రత్యర్థులు దారుణంగా మారణాయుధాలతో హతమార్చిన ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే జల్లయ్య హత్య ఘటనను ఖండించిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని, హత్య చెయ్యమని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పల్నాడులో ముగ్గురు టిడిపి కార్యకర్తలను చంపేసినా, వైసిపి నేతలపై చర్యలు తీసుకోవడం లేదని బుద్ధ వెంకన్న ఆరోపణలు గుప్పించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అంటూ మండిపడిన బుద్ధ వెంకన్న, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జల్లయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తాము ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పుచేతల్లో నడుస్తున్నారు అంటూ మండిపడ్డారు.

డిజిపి కార్యాలయం నుండి వస్తున్న ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని, మూడేళ్ల పాటు గౌతమ్ సవాంగ్ ను ఇదేవిధంగా వాడుకున్నారు అంటూ బుద్ధ వెంకన్న ఆరోపించారు. గౌతమ్ సవాంగ్ ను మూడేళ్లపాటు వాడుకొని ఆపై పంపేశారని, ప్రస్తుతం డీజీపీ పరిస్థితి కూడా భవిష్యత్తులో అదే విధంగా ఉండబోతుందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. జగన్ ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానే చూస్తారు అంటూ బుద్ధ వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు తరిమి కొట్టి బుద్ధి చెప్పాలని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనటానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు. చదలవాడ అరవింద్ బాబు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న తదితర టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications