
విజయసాయిరెడ్డి అవినీతి చిట్టాపై జగదాంబ సెంటర్లో చర్చకు సిద్ధమా? బుద్దా వెంకన్న సవాల్
టిడిపి నేత బుద్దా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి శనిలా దాపురించాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయసాయిరెడ్డి గజదొంగ అని, నరరూప రాక్షసుడు అని, బహిరంగంగా ఉరి వేయాలంటూ బుద్దా వెంకన్న తీవ్రపదజాలంతో విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.

వైజాగ్ లో బెదిరింపులకు దిగి ఎన్సిసి భూములను రాయించుకున్నారు: బుద్దా వెంకన్న
వైజాగ్ ను విజయసాయిరెడ్డి దోచుకుంటున్నారని, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భూములను బినామీలతో కాజేయిస్తున్నాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. 1500 కోట్ల విలువైన ఎన్సిసి భూములను 200 కోట్ల రూపాయలకు బినామీలతో కలిసి దోచేశాడని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. విజయ సాయి రెడ్డి డబ్బులు మాత్రమే తింటున్నాడు అంటూ విమర్శలు చేశారు. వైజాగ్ లో బెదిరింపులకు దిగి ఎన్సిసి భూములను ఏ2 రాయించుకున్నారు అని బుద్దా వెంకన్న ఆరోపించారు.

రాష్ట్రమంతా విజయసాయిరెడ్డి పేరు చెబితే వణికిపోతున్నారు
వైజాగ్ మదురవాడలో భూములు ఎలా వచ్చాయో ఏ2 విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి తానే రాజు తానే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని, ఉత్తరాంధ్రలో వీజే ట్యాక్స్ వేస్తున్నాడని బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రమంతా విజయసాయిరెడ్డి పేరు చెబితే వణికిపోతున్నారు అని పేర్కొన్న బుద్దా వెంకన్న, తాము అసత్య ఆరోపణలు చేస్తున్నామని భావిస్తే దమ్ముంటే మమ్మల్ని పీకించు, మాపై కేసులు పెట్టించు అంటూ సవాల్ విసిరారు.

అక్కడ విజయసాయిరెడ్డికి బహిరంగ ఉరి వేసేవారు
ఇంటిలిజెన్స్ ఎస్పీ స్థలాన్ని సైతం వైజాగ్ ఎంపీ దోచుకున్నాడని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉత్తరాంధ్ర ప్రజలు విజయసాయిరెడ్డికి దేహశుద్ధి చేయటం ఖాయం అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. విదేశాల్లో అయితే విజయసాయిరెడ్డికి బహిరంగ ఉరి వేసేవారు అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణను డమ్మీని చేసీ.. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఏ2 వ్యవహరిస్తున్నాడు అని బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు.

ఏప్రిల్ 21న జగదాంబ సెంటర్లో చర్చకు సిద్ధమా .. సవాల్
జగన్ చేతగాని పరిపాలన వల్ల ఏపీలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని, చెత్త పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏపీలో ఉందని బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఏ2 విజయసాయిరెడ్డి భూ దందాలపై ఏప్రిల్ 21న వైజాగ్ జగదాంబ సెంటర్లో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏప్రిల్ 21వ తేదీన విజయసాయి రెడ్డి అవినీతి గురించి సర్వే నెంబర్లతో సహా వైజాగ్ పార్టీ ఆఫీసులో చెబుతానని బుద్దా వెంకన్న వెల్లడించారు.

విజయసాయి రెడ్డి అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం
16 నెలలపాటు జగన్, విజయసాయిరెడ్డి జైలులో క్లాస్ మేట్స్ గా ఉన్నారని, అందుకే సమానంగా పంచుకుంటున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయసాయి రెడ్డికి దమ్ముంటే ఏప్రిల్ 21 వ తేదీన జగదాంబ సెంటర్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని, తప్పుడు కేసులకు భయపడబోమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.