వేధిపులు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (పిక్చర్స్)
హైదరాబాద్: పరీక్షల విభాగం అధికారి వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలలో గల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అత్యధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విద్యార్థిని రెండు రోజుల పాటు కోమాలో ఉంది. ఆదివారంనాడు ఆమె స్పృహలోకి వచ్చింది.
విద్యార్థినిపై వేధింపులు విషయం బయటకు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల విభాగం అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంజరి అనే విద్యార్థి ఆయుర్వేద కళాశాలలో బిఎఎంఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. మే 1వ తేదీ నుంచి పరీక్షలు ఉన్నాయి. దీంతో విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఈ స్థితిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రీఫైనల్స్ నిర్వహించేందుకు కళాశాల పరీక్షల విభాగం ఇంచార్జీ సూర్యప్రకాష్ నిర్ణయించారు. దాని వల్ల ఏప్రిల్ నెల చివరి వరకు పరీక్షలతో, ఆ తర్వాత రికార్డులపై సంతకాల కోసం కళాశాల చుట్టూ తిరిగేందుకు సమయం అయిపోతుందని, వార్షిక పరీక్షలకు చదువుకోవడానికి సమయం ఉండదని ఆందోళన చెందారు.
దాంతో కొంత మంది విద్యార్థులు ఫైనల్స్ ముఖ్యమంటూ ఇళ్లకు వెళ్లిపోయి చదువుకోసాగారు. అదే విధంగా మంజరి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ తరుణంలో పరీక్షల విభాగం అధికారి మంజరిని ఫెయిల్ చేస్తానంటూ తరుచూ ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. దాంతో మనస్తాపానికి గురైన మంజరి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది.
సోమవారంనాడు మంజరి కుటుంబ సభ్యులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో మిగతా విద్యార్థులు కూడా తామూ అదే పరిస్థితి ఎదుర్కుంటున్నామని ఆందోళనకు దిగారు. పరీక్షల విభాగం అధికారి సూర్యప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకు దిగిన విద్యార్థినులు..
పరీక్షల విభాగం అధికారి వేధింపులకు నిరసనగా సోమవారం ఆందోళనకు దిగిన బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాల విద్యార్థినులు

శివమెత్తిన విద్యార్థినులు..
మంజరి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వెలుగు చూడడంతో విద్యార్థినులు పరీక్షల విభాగం అధికారిపై శివాలెత్తారు.

కోమాలో మంజరి...
పరీక్షల విభాగం అధికారి వేధింపులతో మనస్తాపానికి గురైన మంజరి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి రెండు రోజుల పాటు కోమాలో ఉంది.

మంజరి అనే విద్యార్థిని ఈమెనె...
ఫైనల్ పరీక్షకు సిద్ధం కావడానికి ఇంటికి వెళ్లిన మంజరిని పరీక్షల విభాగం అధిపతి సూర్యప్రకాష్ ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ వచ్చాడని ఆరోపణలు వచ్చాయి.

పోలీసుల అదుపులో అధికారి...
మంజరి అనే విద్యార్థిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పరీక్షల విభాగం అధికారి సూర్యప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలా వ్యానులో..
విద్యార్థినుల ఆగ్రహానికి గురైన పరీక్షల విభాగం అధికారి సూర్యప్రకాష్‌ను పోలీసులు తమ వాహనంలో తరలిస్తున్న దృశ్యం












Click it and Unblock the Notifications