మూతిపై తంతే మరో చోట తంతాం: కెసిఆర్‌పై బైరెడ్డి తీవ్ర వ్యాఖ్య
కర్నూలు: పౌరుషాల పురిటగడ్డ రాయలసీమలో తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పప్పులు ఉడకవని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు జలదోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన శుక్రవారం జలసాధన దీక్ష చేపట్టారు.
సుంకేసుల డ్యాంపై బాంబులు వేస్తానన్న తెలంగాణ కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ వేసేవి గ్యాస్ బాంబులేనని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ కొడకా అంటే.. ఇంకోపై మాట అంటాం. మూతిమీద తంతే.. ఇంకోచోట తంతాం' అని హెచ్చరించారు. ఎగువన కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం చూస్తుంటే రాయలసీమను సమాధి చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని బైరెడ్డి అన్నారు.

కృష్ణా, తుంగభద్ర జలాలను వినియోగిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు చెరో 120 టిఎంసిల నీటిని అక్రమంగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ సమాధి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తాము చేస్తున్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు.
ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ సింగటూరు, భద్ర, తుంగ నదులపై పలు చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. దీని కారణంగా దిగువన ఉన్న రాయలసీమకు సాగునీటి సంగతి పక్కన పెడితే తాగడానికి కూడా గుక్కెడు నీరు ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన చేసిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 120 టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలీకృతమైతే రాయలసీమలో రాళ్లు తప్ప మరేమీ కనిపించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నాటక ట్రిబ్యునల్ కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీరు వినియోగించకుండా అడ్డుకోవాలని సూచించారు. వేదవతి, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బైరెడ్డి కోరారు. రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications