ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా: కింగ్ ఆఫ్ టెస్ట్ క్రికెట్
ఆస్ట్రేలియాతో కేప్ టౌన్ న్యూలాండ్స్ లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 176 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. రెండో ఇన్నింగ్ లో ఆస్ట్రేలియా 111 పరుగులకు కుప్పకూలింది. పేస్, స్పిన్ బౌలింగ్ ధాటికి ఏ మాత్రం కూడా నిలవలేకపోయింది బ్యాటింగ్ ఆర్డర్. పేకమేడలా నేలవాలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లందరిలో నలుగురు మాత్రమే రెండంకెల వ్యక్తిగత స్కోర్ చేయగలిగారంటే దక్షిణాఫ్రికా బౌలింగ్ తడాఖా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్ లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్ లో 429 పరుగులతో భారీ ఆధిక్యత సాధించినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్ లో దక్షిణాఫ్రికా 387 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్- 101, లోయర్ ఆర్డర్ బ్యాటర్ వియాన్ ముల్డర్- 115 పరుగులతో ఇన్నింగ్ కు ప్రాణం పోశారు. భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు.

మొత్తంగా 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఏ దశలో కూడా కోలుకోనివ్వలేదు ప్రొటీస్ బౌలర్లు. ఓపెనర్ ట్రావిస్ హెడ్- 14, మాట్ రెన్ షా- 0, మార్ముస్ లబుషేన్- 4, కామెరాన్ గ్రీన్- 27, జోస్ ఇంగ్లీస్- 4, అలెక్స్ క్యారీ- 2, కూపర్ కొనొలి- 0, మిఛెల్ స్టార్- 0, కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 11, జోష్ హేజిల్ వుడ్- 0.. ఇలా పెవిలియన్ కు వరుస కట్టారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ నాథన్ లియాన్ ఒక్కడే 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను కొంతవరకు ప్రతిఘటించాడు.
ఈ మ్యాచ్ లో పేస్ బౌలర్ కగిసొ రబడ, స్పిన్నర్ సైమన్ హార్మర్ తమ మేజిక్ స్పెల్ తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచారు. హార్మర్ ఆరు వికెట్లు నేల కూల్చాడు. రబడ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో టెస్ట్ ఫార్మట్ లో దక్షిణాఫ్రికా మళ్లీ నంబర్ 1 పొజీషన్ కు చేరుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫార్మట్ లో అగ్రస్థానానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అలాగే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కూడా రెండో స్థానానికి ఎగబాకింది దక్షిణాఫ్రికా. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగింది. రెండో స్థానంలో న్యూజిలాండ్, మూడో స్థానంలో దక్షిణాఫ్రికాలు ఉండేవి. సిరీస్ ముగిసేసరికి పాయింట్లు తలకిందులయ్యాయి. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోగా.. దక్షిణాఫ్రికా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. న్యూజిలాండ్ టాప్ కు చేరుకుంది.













Click it and Unblock the Notifications
