అల్లు అర్జున్‌పై బైరెడ్డి శబరి సెటైరికల్ ట్వీట్.. డిలీట్!!
ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, నాటి అల్లు అర్జున్ పర్యటన రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఆనాటి పర్యటన గుర్తు చేస్తూ అల్లు అర్జున్‌పై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశారు. 'అల్లు అర్జున్ గారూ.. నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించినట్లుగానే.. ఇక్కడే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను' అని బైరెడ్డి శబరి ఎక్స్(ట్విట్టర్)వేదికగా పేర్కొన్నారు.

నంద్యాలను సందర్శించాలన్న మీ సెంటిమెంట్ మాకు మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. అల్లు అర్జున్.. ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంట్. అంతేకాదు.. మీ పుష్ప-2 సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని బైరెడ్డి శబరి తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
పుష్పమూవీ, పుష్ప2, పుష్ప2దిరూల్, జనసేన అనే ట్యాగ్‌లను తన ట్వీట్ కు జత చేశారు బైరెడ్డి శబరి. అయితే, కాసేపటికే జనసేన ట్యాగ్ తొలగించారు. ఆ తర్వాత మొత్తం ట్వీట్‌నే బైరెడ్డి శబరి డిలీట్ చేయడం గమనార్హం. అయితే, ఆమె చేసిన ట్వీట్లకు మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు చేయగా.. మరికొందరు మీకు ఇలాంటివి ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నించారు. భిన్న స్పందనలు రావడంతో శబరి తన ట్వీట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలావుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్ప: ది రైజ్ విజయం తర్వాత.. పుష్ప రాజ్ కథలో తదుపరిది ఏం జరిగిందో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.












Click it and Unblock the Notifications