రాజమండ్రిలో రాజధానుల పోరు-అమరావతి యాత్ర వర్సెస్ వికేంద్రీకరణ సభ-పోలీసులకు చుక్కలు
అమరావతి రాజధాని కోరుతూ అరసవిల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర ఇవాళ రాజమండ్రి నగరంలో సాగనుంది. దీంతో ఈ యాత్రకు పోటీగా వైసీపీ వికేంద్రీకరణ సభ పెట్టింది. ఆజాద్ సర్కిల్ లో వైసీపీ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మీదుగానే అమరావతి యాత్ర కొనసాగనుండటంతో పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో మంత్రులపై జనసేన కార్యకర్తల దాడి నేపథ్యంలో పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

రాజమండ్రిలో అమరావతి యాత్ర
రాజమండ్రిలో ఇవాళ అమరావతి రైతులు రాజధాని పాదయాత్రను కొనసాగించబోతున్నారు. ఇప్పటికే కొవ్వూరు గామన్ వంతెన మీదుగా నగరంలోకి ప్రవేశించిన యాత్ర.. ఇవాళ నగరంలో 8 కిలోమీటర్లు పయనించి మోరంపూడి జంక్షన్ మీదుగా జాతీయ రహదారిపైకి చేరనుంది. దీంతో నగరంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో అమరావతి రైతులయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీల నేతలు మధ్యలో సంఘీభావం ప్రకటించేందుకు తరలివస్తుండటంతో యాత్రకు ప్రాధాన్యం పెరుగుతోంది.

పోటీగా వైసీపీ వికేంద్రీకరణ సభ
అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి నగరంలో కొనసాగనున్న నేపథ్యంలో వైసీపీ దీనికి పోటీగా వికేంద్రీకరణ సభ నిర్వహిస్తోంది.అజాద్ సర్కిల్ లో నిర్వహిస్తున్న ఈ సభకు పలువురు రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సభకు కూడా పోలీసులు గట్టి బందోబస్తు కల్పించాల్సిన పరిస్ధితి. అంతే కాదు ఈ సభా ప్రాంగణం మీదుగానే అమరావతి పాదయాత్ర కొనసాగే అవకాశం ఉండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. దీనికి తోడు నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం దీనికి ఆజ్యం పోస్తోంది.

విశాఖ ఘటనతో పోలీసుల్లో టెన్షన్
విశాఖలో తాజాగా మంత్రుల కాన్వాయ్ పై జనసేన నేతలు దాడి చేసిన ఘటనతో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తి పోశాయి. అనంతరం పవన్ కళ్యాణ్ ను నోటీసులు ఇచ్చి హోటల్ కు పరిమితం చేశారు. చివరికి వైజాగ్ లో టెన్షన్ సద్దుమణిగింది. ఇప్పుడు రాజమండ్రిలో అమరావతి పాదయాత్ర వర్సెస్ వికేంద్రీకరణ సభగా పరిస్ధితి మారడంతో పోలీసులకు మరోసారి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎవరినీ ఏమీ అనలేని పరిస్ధితుల్లో పోలీసులు ఇరుకునపడుతున్నారు. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి వారికి నెలకొంది.