తప్పుగా జాతీయగీతం: గజల్ శ్రీనివాస్, అశోక్‌లపై కేసు
హైదరాబాద్: జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారనే ఆరోపణపై ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబులమీద కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లిలోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు సైఫాబాద్ పోలీసులను ఆదేశించారు.
అనంతరం మార్చి 6న దర్యాప్తు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. నిరుడు సెప్టెంబర్ 7న 'సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట' ఏపీఎన్జీవో ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ఎన్జీవోలు మాత్రమే పాల్గొనాలన్న షరతుతో హైకోర్టు అనుమతి ఇవ్వగా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారని అన్నారు.

ఆ తర్వాత జాతీయ గీతాన్ని మధ్యమధ్యన ఆపుతూ తప్పుగా ఆలపించి అవమానించారని ఆ మర్నాడే న్యాయవాది బద్దం నరసింహారెడ్డి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో డిసెంబర్ 31న నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయగా, తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోల సంఘం తరఫున హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో సమైక్య సభ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో గజల్ శ్రీనివాస్ పాల్గొని సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ గీతాలు కూడా పాడారు.












Click it and Unblock the Notifications