పోలీసులపై వ్యాఖ్యలు: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మరిడిమాంబ ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు.
నర్సీపట్నం గ్రామదేవత మరిడిమాంబ పండుగను నిర్వహించడానికి ఎఎస్పీ అనుతులు ఇవ్వట్లేదని అయ్యన్నపాత్రుడు ఆరోపించిన విషయం తెలిసిందే. రికార్డింగ్ డాన్సులను నిర్వహించినా, వాహనాల రాకపోకలకు ఆటంకాన్ని కలిగించినా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేసినట్లు అయ్యన్న చెప్పారు. వివిధ కారణాలతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. ఉత్సవాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. స్పందించలేదని విమర్శించారు.

ఇదివరకు నర్సీంపట్నం చుట్టుపక్కల నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారనే సమాచారం తన వద్ద ఉందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. వారికెందుకు అనుమతులు ఇచ్చారని ఆయన నిలదీశారు. అధికార పార్టీ నాయకులకు మాత్రమే పండగ చేసుకునే అవకాశాన్ని పోలీసులు ఇచ్చారని మండిపడ్డారు. కరోనా వల్ల కిందటి ఏడాది పండగను జరుపుకోలేకపోయామని గుర్తు చేశారు. తాను స్వయంగా ఏఎస్పీని కలిసి, వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందించలేదని అన్నారు.
వాహనాల రాకపోెకలను అడ్డుకున్నా, స్టేజీ డాన్సులను నిర్వహించినా అడ్డుకుంటామని, అరెస్ట్ చేస్తామని ఎఎస్పీ హెచ్చరించినట్లు అయ్యన్న చెప్పారు. తాము మాజీ మంత్రి కొడాలి నానిలాగా పేకాట క్లబ్బులను నిర్వహించట్లేదని అయ్యన్న ధ్వజమెత్తారు. ఆడవాళ్లతో అశ్లీల డాన్సులను తాను ప్రోత్సహించట్లేదని, అయినప్పటికీ- నర్సీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు జరిగాయని, పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, వారికి ఎలా అనుమతులు ఇచ్చారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications