నిందితుడిగా కేంద్ర మంత్రి: జగన్ పార్టీ ఎమ్మెల్యేలకూ డబ్బులు?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటుకు ఓటు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రిని ఒకర్ని, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ్యుడిని, మరో లోకసభ సభ్యుడిని నిదింతులుగా చేరుస్తారని అంటున్నారు. అందుకు తగిన సాక్ష్యాధారాలను ఎసిబి సేకరించినట్లు సమాచారం.
రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవడానికి ముందు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటుకు ఓటు కుంభకోణంలో డబ్బును కూడగట్టడంతో పాటు ప్రత్యక్షంగా కేంద్ర మంత్రికి ప్రమేయం ఉందని చెప్పడానికి అవసరమైన సాక్ష్యాధారాలను ఎసిబి సేకరించినట్లు చెబుతున్నారు.
ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లంచం ఇచ్చినట్లు ఎసిబి భావించి, అందుకు అవసరమైన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. టిడిపి సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి ఓటు వేస్తామనే హామీ తీసుకుని పది లక్షలకు బేరం కుదుర్చుకుని ఐదేసి లక్షల రూపాయల చొప్పున ముట్టజెప్పినట్లు చెబుతున్నారు.

నోటుకు ఓటు కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను నిందితులుగా చేరుస్తారా, సాక్షులుగా పరిగణిస్తారా అనేది తేలాల్సి ఉంది. వారు లంచం తీసుకున్నప్పటికీ తమకే ఓటు వేశారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో వారి పట్ల కొంత ఉదారంగా వ్యవహరించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఓ కాంగ్రెసు శాసనసభ్యుడిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
అయితే, ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులను కొనడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినట్లు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీడియా సమావేశంలో చెప్పారు. కాగా, కేసులో విఐపిలంటూ ఉండరని, నిందితులు మాత్రమే ఉంటారని ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications