ఢిల్లీలో ఎదురు పడ్డారు: మీతో ఫొటో దిగాలనుందని బాబుతో గవర్నర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో ఎదురు పడ్డారు. నోటుకు ఓటు కేసు నేపథ్యంలో ఇరువురు కూడా బుధవారంనాడు ఢిల్లీలో పలువురు నేతలను కలవడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో ఇరువురు ఎదురు పడ్డారు. కరచాలనం చేసుకున్నారు.
నోటుకు ఓటు కేసు నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌పై తెలుగుదేశం పార్టీ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ తన అధికారాలను ఉపయోగించడం లేదని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి పూనుకున్న నేపథ్యంలో ఈ యాదృచ్ఛిక కలయిక జరిగింది.

చంద్రబాబు, నరసింహన్ బుధవారం కొన్ని గంటల తేడాతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. ఈ స్థితిలో రాజ్‌నాథ్ కార్యాలయంలో ఇరువురు పరస్పరం ఎదురుపడ్డారు. వాస్తవానికి ఐదు గంటలకు చంద్రబాబు హోంమంత్రితో భేటీ కావాలి. కానీ ప్రధానితో భేటీ గంట పాటు జరగడంతో చంద్రబాబు హోంమంత్రి కార్యాలయానికి ఆలస్యంగా వచ్చారు. ఈలోగానే గవర్నర్ నరసింహన్ కూడా హోంమంత్రిని కలుసుకోవాలని వచ్చారు.
చంద్రబాబు రాక ఆలస్యం కావడంతో పది నిమిషాల ముందే, అంటే 5.20కే గవర్నర్‌ను రాజ్‌నాథ్ పిలిచారు. సరిగ్గా 5.30 గంటలకు చంద్రబాబు తన కార్యాలయానికి చేరుకున్నారని తెలియడంతో, రాజ్‌నాథ్ అప్పటికప్పుడు స్పం దించారు. ఆయన అభ్యర్థన మేరకు గవర్నర్ బయటకు వచ్చేశారు. అప్పుడే ఆయనకు చంద్రబాబు ఎదురయ్యారు. ఇరువురూ చిరునవ్వుతో పలకరించుకున్నారు.
‘మీతో ఫోటో దిగాలని ఉంది' అంటూ చంద్రబాబు చేయి పట్టుకుని అక్కడే ఉన్న ఒక ఫోటోగ్రాఫర్‌కు గవర్నర్ పోజులిచ్చారు. ఆ తర్వాత రాజ్‌నాథ్‌తో భేటీకి చంద్రబాబు వెళ్లారు. గవర్నర్ నరసింహన్ ఐబీ అధికారులను కలుసుకునేందుకు వెళ్లారు.
సరిగ్గా 6 గంటలకు రాజ్‌నాథ్‌తో భేటీ ముగించుకుని చంద్రబాబు బయటికి వచ్చిన కొన్ని నిమిషాలకే మళ్లీ గవర్నర్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈసారి హోంమంత్రితో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన హోం సెక్రటరీ గోయల్‌ను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications