గోదావరి జిల్లాల్లో వైసీపీకి షాకులు-చెదురుతున్న కులసమీకరణాలు-పవన్ కు మేలు చేస్తుందా ?
ఏపీలోని గోదావరి జిల్లాలకు ఓ ప్రత్యేకత ఉంది. భారీ సంఖ్యలో అసెంబ్లీ సీట్లు కలిగిన ఈ జిల్లాల్లో ఏ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. దీంతో అన్ని పార్టీలూ గోదావరి జిల్లాలపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో కులసమీకరణాలకు ప్రత్యేక స్ధాన ముంది. ఇక్కడ కులసమీకరణాలను ఎవరు తమకు అనుకూలంగా మార్చుకుంటారో వారే విజేతలవుతారు. ఇలా గతంలో గోదావరి జిల్లాల్లో పైచేయి సాధించిన వైసీపీకి క్రమంగా పరిస్ధితులు ప్రతికూలంగా మారుతున్నాయి.

గోదావరి కుల సమీకరణాలు
గోదావరి జిల్లాల్లో కులసమీకరణాలు బయటి వారికి ఓ పట్టాన అర్దం కావు. కాపుల ఆధిపత్యం ఎక్కువగా కనిపించే గోదావరి జిల్లాల్లో ఎస్సీలు, క్షత్రియుల హవా కూడా ఎక్కువే. దీంతో గోదావరి జిల్లాల్లో ప్రాంతాల వారీగా ఆయా కులాలు ఆధిపత్యం సాగిస్తుంటాయి. ఇందులో ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులానికి ఇతర కులాలతో పోరు ఉంటుంది. కొన్ని చోట్ల కాపులు వర్సెస్ ఎస్సీల పోరు ఉంటే.. మరికొన్ని చోట్ల కాపులు వర్సెస్ క్షత్రియుల పోరు ఉంటుంది. అయితే సమయానుకూలంగా వీటిని సమతూకం చేయడం ద్వారా పార్టీలు రాజకీయంగా ఆధిక్యం సాధిస్తుంటాయి. ఇలా 2019లో ఆధిక్యం సాధించిన వైసీపీకి ఇప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.

కాపులు వర్సెస్ ఎస్సీలు
రాష్ట్రంలో కాపులు, ఎస్సీల మధ్య సఖ్యత సంగతి ఎలా ఉన్నా.. గోదావరి జిల్లాల్లో మాత్రం వీరిద్దరి మధ్య చాలాసార్లు పోరు సాగిన సందర్భాలే కనిపిస్తాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని కోనసీమతో పాటు పలు చోట్ల కాపులకూ, ఎస్సీలకూ అస్సలు పొసగదు. అయినా రాజకీయ పార్టీలు వీరిద్దరినీ సమన్వయం చేసుకుంటూ విజయాలు సాధిస్తుంటాయి. అయితే ఓ ఎన్నికల్లో ఈ సమీకరణాల్ని బ్యాలెన్స్ చేసే పార్టీలు మరో ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడుతుంటాయి. ఇదే కోవలో గత ఎన్నికల్లో కాపులు, ఎస్సీల మధ్తతు పొందిన వైసీపీ... ఇప్పుడు మాత్రం వీరిద్దరినీ సమన్వయం చేయలేక నానా ఇబ్బందులు పడుతోంది. దీనికి తాజాగా చోటుచేసుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యతోపాటు, కోసనీమ జిల్లాకు అంబేద్కతర్ పేరు పెట్టడం వంటి పలు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కాపులు వర్సెస్ రాజులు
గోదావరి జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత భీమవరం జిల్లాలో కాపులు వర్సెస్ రాజుల పోరు నిరంతరం సాగుతుంటుంది. ఇక్కడ సినిమా హీరోల పేరుతో కూడా అభిమానులు కులాల వారీగా చీలిపోతుంటారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు పరస్పరం ఫ్లెక్సీలు చింపుకున్న ఘటనలు అనేకం. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నరసాపురంలో ప్రసాదరాజు, సుబ్బారాయుడు వర్గాల మధ్య సాగుతున్న పోరుతో వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఓసారి క్షత్రియులకు మంత్రి పదవి ఇచ్చి తీసేసిందనే బాధ, తమ సామాజికవర్గానికి చెందిన రఘురామరాజును టార్గెట్ చేస్తోందన్న ఆవేదనతో ఉన్న రాజులకు ఇప్పుడు కాపులతో పోరు కూడా తోడవడంతో వైసీపికి ఇబ్బందులు తప్పడం లేదు.

ఈసారి పవన్ కు వరమవుతుందా ?
గతంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు, ఎస్సీలు ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గారు. అయితే ఇప్పుడు వీరిద్దరి పోరును సమన్వయం చేయడంలో వైసీపీ విఫలమైతే.. వారు మళ్లీ మరో పార్టీని వెతుక్కోవడం ఖాయం. అందులో టీడీపీ లేదా జనసేనవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అందునా గోదావరి జిల్లాల్లో అదికంగా ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ మేరకు వైసీపీ నష్టపోవడం ఖాయం. గతంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి మొగ్గు చూపిన ఆయా సామాజిక వర్గాలు ఈసారి జనసేనకు జై కొడితే మాత్రం కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై గట్టి ప్రభావమే పడే సూచనలున్నాయి.