వివేకా కేసులో సీబీఐ దూకుడు-ఇవాళ మరో నిందితుడు అరెస్ట్ ? కడప నుంచి హైదరాబాద్ కు..
ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు జోక్యంతో మారిన సీబీఐ టీమ్ ఈ కేసులో చడీచప్పుడు లేకుండా దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ పులివెందుల వెళ్లిన సీబీఐ టీమ్.. అక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడిని అదుపులోకి తీసుకుని కడప జైలు గెస్ట్ హౌస్ కు తరలించింది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని గతంలో పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. కానీ అరెస్టు చేయలేదు. ఇవాళ మాత్రం సడన్ గా పులివెందుల వెళ్లిన సీబీఐ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కు తరలించి ప్రాధమిక విచారణ అనంతరం అరెస్టు చేసింది. అంతే కాదు కడప నుంచి హైదరాబాద్ కు కూడా తరలిస్తోంది.

వివేకా హత్యలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రపై సీబీఐకి అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివేకా హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో ఆయనతో పాటు తండ్రి భాస్కర్ రెడ్డితోనూ ఉదయ్ సమావేశమైనట్లు సీబీఐ భావిస్తోంది.ఇందుకు సంబంధించి గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు సేకరించిన సీబీఐ.. వాటి ఆధారంగా ఉదయ్ పాత్రపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వివేకా హత్య తర్వాత ఫ్రీజర్, అంబులెన్స్, వైద్యుల్ని తెప్పించడంలో ఉదయ్ పాత్రపై ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు వివేకా హత్య కేసులో ఇప్పటికే దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా కోర్టుకు మాత్రం తగిన వివరాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైంది. దీంతో కేసు దర్యాప్తు ఇంకెన్నాళ్లు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. టీమ్ లో మార్పులు చేసింది. అంతేకాదు వివేకా కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు విధించింది. దీంతో నిర్ణీత గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications