వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు..
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటనల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఒకటి. ఈ కేసులో లేటెస్ట్ గా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును మళ్లీ పూర్తి దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాజా పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బుధవారం కీలక తీర్పును ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఫోన్ సంభాషణపై దర్యాప్తు..
ఇందులో భాగంగా కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. అలాగే సీబీఐని సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేసేలా ఆదేశించాలని కోరారు.

వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్, వైఎస్ భాస్కర్‌రెడ్డి సోదరుడు కుమారుడైన అర్జున్‌రెడ్డి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగిందని సునీత తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా అర్జున్‌రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. సునీత తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ఎస్ గౌతం వాదనలు వినిపించారు.
అయితే ఈ పిటిషన్‌పై నిందితుల తరఫున ఉన్న న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇప్పటికే విస్తృత దర్యాప్తు జరిగిందని, కొత్తగా విచారణ ప్రారంభించడం అవసరం లేదని వాదించారు. ఇప్పటికే దాఖలైన ఛార్జ్‌షీట్ సరిపోతుందని, మళ్లీ దర్యాప్తు చేస్తే కేసు లేనిపోని దిశలకు వెళ్తుందని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు వివేకా హత్య కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్జున్‌రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తునకు ఆదేశించింది.
మొత్తంగా వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటోంది. తాజా తీర్పుతో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకునే అవకాశముంది. ఫోన్ రికార్డుల దర్యాప్తు కేసు అసలు కుట్రదారుల వైపు దారి తీస్తుందా? మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయా? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications