ఫ్లెక్సీ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
కేసుల దర్యాప్తులో అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు. అవినీతి కేసుల్లో ఉన్న రాజకీయ నాయకులను గడగడలాడించారు. ఆయన దగ్గరకు కేసు వచ్చిందంటేనే అందులోని నిందితులను నిద్ర ఉండేది కాదు. అటువంటి వ్యక్తి ఒక ఫ్లెక్సీ పోయిందంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆయన ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీని అపహరించినవారిని పట్టుకొని శిక్షించాలంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీలాంటివారిని ఆదర్శంగా తీసుకొని పోలీసు ఉద్యోగంలోకి వచ్చాంసార్.. వెంటనే మీ ఫ్లెక్సీని వెతికిస్తామని వారు హామీ ఇచ్చారు.
వ్యవసాయంపై మక్కువతో లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో 12 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు. రైతులకు అవగాహన కోసం తన పొలంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అది మాయమైంది. ఈ క్షేత్రాన్ని సంరక్షించేవారు విషయాన్ని ముందుగా పోలీసులకు తెలిపారు. తర్వాత లక్ష్మీనారాయణ నేరుగా ప్రత్తిపాడు స్టేషన్‌కు వెళ్లి నిందితులను పట్టుకోవాలని కోరారు.

సీబీఐ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో వీవీ లక్ష్మీనారాయణ కీలకమైన కేసులను విచారించారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకొని 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్వతహాగా మొదటి నుంచి వ్యవసాయంపై మక్కువ ఉండటంతో కాకినాడ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications