లక్నో కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ లక్నో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు రిషబ్ పంత్ ప్రకటించాడు. ఈ మేరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించాలన్న రిషబ్ పంత్ అభ్యర్థనను లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ఆమోదించింది. ఐపీఎల్ 2026 సీజన్ పాయింట్ల పట్టికలో లక్నో జట్టు అందరికంటే దిగువన చివరి స్థానంలో నిలవడంతో రిషబ్ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
పాయింట్ల పట్టిక చివరి స్థానం.. బ్యాటర్‌గానూ ఫెయిల్!
ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి 8 పాయింట్లతో టేబుల్ చివర్లో 10వ స్థానంతో సరిపెట్టుకుంది. కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రిషభ్ పంత్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ 14 మ్యాచ్‌ల్లో 138.05 స్ట్రైక్ రేట్‌తో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకప్పుడు విధ్వంసకర బ్యాటింగ్‌తో భయపెట్టిన రిషబ్ పంత్.. ఈ సీజన్‌లో కనీసం ఒక్క ఇంపాక్ట్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.

రూ.27 కోట్ల రికార్డు ధర.. కానీ ఫలితం మాత్రం శూన్యం
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరకు రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. భారీ ఆశలతో అతనికి జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే పంత్ కెప్టెన్సీలో గడిచిన రెండు సీజన్లలో లక్నో జట్టు దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. ఒక సీజన్‌లో 7వ స్థానంలో నిలిచిన లక్నో.. ఈ ఏడాది 10వ స్థానానికి పడిపోయింది. పంత్ కెప్టెన్సీలో లక్నో జట్టు మొత్తం 28 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 10 మ్యాచ్‌ల్లో గెలిచి, ఏకంగా 18 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అలాగే రెండు సీజన్లలో కలిపి పంత్ కేవలం 581 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
టామ్ మూడీ భావోద్వేగం.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
రిషబ్ పంత్ రాజీనామాపై లక్నో సూపర్ జాయింట్స్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందిస్తూ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎవరికైనా చాలా కష్టమైన విషయమని పేర్కొన్నారు. రిషబ్ పంత్ స్వయంగా వచ్చి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోరడంతో తాము అతని నిర్ణయాన్ని గౌరవించామని చెప్పారు. కెప్టెన్‌గా జట్టుకు రిషబ్ పంత్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపిన మూడీ.. రాబోయే సీజన్ కోసం జట్టును సరికొత్తగా పునర్నిర్మించడంపైనే తాము దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. కాగా లక్నో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఫ్రాంచైజీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా వెల్లడిస్తామని లక్నో యాజమాన్యం పేర్కొంది.












Click it and Unblock the Notifications