Vizag Drugs: వైజాగ్ డ్రగ్స్ కేసులో ఎవరి పాత్ర ఎంత ? పోలీసులు సీబీఐకి అడ్డుపడ్డారా ?
విశాఖలో తాజాగా బ్రెజిల్ నుంచి వచ్చి పట్టుపడిన భారీ డ్రగ్ కంటెయినర్ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. అదే సమయంలో విశాఖ పోలీసుల తీరుపై సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో చేసిన ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చుకున్నా అనుమానాలు మాత్రం తొలగిపోలేదు.
విశాఖలో ఈ నెల 16న బ్రెజిల్ నుంచి వచ్చిన భారీ కంటెయినర్ ను సీబీఐ అధికారులు ఇంటర్ పోల్ సమాచారంతో వెంబడించి పట్టుకున్నారు. తమిళనాడు తీరం నుంచి దీన్ని ఫాలో అవుతూ వచ్చిన సీబీఐ.. ఎట్టకేలకు విశాఖ తీరానికి చేరగానే స్వాధీనం చేసుకుంది. ఇందులో 50 వేల కిలోల ఈస్ట్ ఉన్నట్లు దీన్ని తెప్పించిన సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ చెప్తుండగా.. ఇందులో ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ తెచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. వాస్తవాలు తెలుసుకునేందుకు సీబీఐ కోర్టు జడ్జి నేరుగా దీన్ని పరిశీలించి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. రెండు వారాల్లో ఈ రిపోర్ట్ రాబోతోంది. అనంతరం వాస్తవాలు వెల్లడవుతాయి.

అయితే సీబీఐ అధికారులు విశాఖ తీరంలో ఈ కంటెయినర్ ను పట్టుకునే సమయంలో ఏపీ పోలీసులు ఆటంకాలు కల్పించారని ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు. వీటిని విశాఖ పోలీసులు ఖండించారు. కేవలం తాము డాగ్ స్క్వాడ్ అడిగితే ఇవ్వడానికి వెళ్లామని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ చెబుతున్నారు. ఇంకా గట్టిగా అడిగితే ఫొటోలు తీసే సమయంలో తాము అక్కడి వెళ్లడం సీబీఐ ఆటంకంగా భావించి ఉంటుందంటున్నారు. ఇందులో నిజానిజాలు సీబీఐ కోర్టు విచారణలో తేలనున్నాయి.
మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్ధ పెద్దలు కూనం వీరభద్రరావు, ఇతరులకు అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తాజాగా బయటపడుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ ఎన్నికల సమయం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా అందరికీ ఈ మసి అంటించేందుకు ప్రత్యర్ధి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సీబీఐ కోర్టు విచారణ తర్వాత ఇందులో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications