సీబీఐ వలలో డీకే ఆదికేశవులు నాయుడు కొడుకు, కూతురు
చిత్తూరు మాజీ ఎంపీ, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు డీఏ శ్రీనివాస్, కుమార్తె కల్పజ అరెస్ట్ అయ్యారు. వివిధ నేరాల కింద వారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మార్తహళ్లిలో గల నివాసంలో వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో వారిద్దరితో పాటు కర్ణాటక మానవ హక్కుల కమిషన్ డీఎస్పీ మోహన్ కూడా ఉన్నారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి పలు ఆరోపణలను వారు ఎదుర్కొంటోన్నారు.
కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ అరెస్టులు జరిగాయి. 2019 నాటి కేసులు ఇవి. డీకే ఆదికేశవులు నాయుడు సన్నిహితుడు కే రఘునాథ్ మరణంతో ఆరంభం అయ్యాయి. ఈ కేసులను మొదట బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని అభ్యర్థించారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదికేశవులు నాయుడుకు భారీ ఆస్తులుండేవి. రఘునాథ్ కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పలు స్థిరాస్తులకు యజమాని. 2013లో ఆదికేశవులు మరణానంతరం రఘునాథ్ ఆయనకు చెందిన అనేక ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని తమ పేర్ల మీద బదలాయించాలని, తండ్రి ఆస్తులకు తాము వారసులమని అప్పట్లో శ్రీనివాస్, కల్పజ, మరికొందరు, రఘునాథ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
రఘునాథ్ పేరు మీదున్న ఆస్తుల ఆదాయ వనరులు సైతం తన తండ్రిదేనని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వాటిని కూడా తమకు బదిలీ చేయాలని పట్టుబట్టారు. ఈ సంఘటనల నేపథ్యంలో 2019 మేలో రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. రఘునాథ్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసహజ మరణంగా కేసు నమోదు చేయగా 2020 ఫిబ్రవరిలో ఆయన భార్య సంచలనాత్మక ఆరోపణ చేశారు. ఆస్తి తగాదాల కారణంగా తన భర్తను శ్రీనివాస్ మరికొందరు హత్య చేశారని ఆమె ఫిర్యాదు చేశారు.
దీనిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తు సక్రమంగా సాగట్లేదని, తన పలుకుబడిని ఉపయోగించి శ్రీనివాస్, కల్పజ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ రఘునాథ్ కుటుంబం ఆరోపించింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీని తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. తాజాగా నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. నేడు న్యాయస్థానంలో హాజరుపరుస్తారు.












Click it and Unblock the Notifications