ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు: కాంగ్రెస్‌పై హరీష్ నిప్పులు
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు హరీష్ రావు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ఆస్తుల పైన సిబిఐ విచారణకు తాము సిద్ధమని హరీష్ రావు అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీ సిబిఐ పేరుతో తమను బెదిరించాలని చూస్తోందన్నారు.
సిబిఐ పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. కెసిఆర్ దాటిని తట్టుకోలేకే సిబిఐతో కాంగ్రెసు పార్టీ దాడులు చేయించాలని చూస్తోందన్నారు.

ప్రతిపక్షాలు దారికి రాకుంటే సిబిఐతో బెదిరించడం కాంగ్రెసు పార్టీకి అలవాటే అన్నారు. తెరాస అధికారంలోకిరావడం ఖాయమన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెసు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. కెసిఆర్, హరీష్ రావు, తన ఆస్తుల పైన విచారణను తాను స్వాగతిస్తున్నానని విజయశాంతి చెప్పిన విషయం తెలిసిందే. ముగ్గురి ఆస్తులపై త్వరగా సిబిఐ విచారణ చేపట్టాలని ఆమె కోరారు.
కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాక్ తగిలింది. కెసిఆర్ ఆస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐని శుక్రవారం ఆదేశించింది. కెసిఆర్, తెరాస సీనియర్ నేత హరీష్ రావు, కాంగ్రెసు పార్టీ నాయకురాలు విజయశాంతిల ఆస్తుల పైన విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో గురువారం ప్రయివేటు ఫిర్యాదు దాఖలైంది. దీనిని స్వీకరించిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications