ఏపీ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల..!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి కేంద్రం ఇవాళ శుభవార్త చెప్పింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని ఇవాళ విడుదల చేసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధుల బకాయిల్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమచేసింది. దీంతో అమరావతి రాజధాని పనుల తిరిగి ప్రారంభానికి ప్రధాని మోడీ రాక వేళ కేంద్రం నుంచి అందిన సాయం చర్చనీయాంశమవుతోంది.
15వ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్ కు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన రూ.1121.20 కోట్ల నిధుల్ని ఇవాళ కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్తులకు, పంచాయతీలకు ఈ నిధులు కేటాయించారు. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం నుంచి ఈ నిధులు విడుదల చేశారు. ఈ నెలలో రాష్ట్రంలో 16వ ఆర్ధిక సంఘం పర్యటించి వెళ్లింది. రాష్ట్రం నుంచి తీసుకున్న ప్రతిపాదనల ప్రకారం కేంద్రానికి సిఫార్సులు చేస్తోంది.

15వ ఆర్ధిక సంఘం ప్రణాళిక ప్రకారం ఈ నిధులలో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్‌లకు, మిగిలిన 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించబడతాయి. జనాభా కొలమానాల ఆధారంగా ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ నేరుగా గ్రామ పంచాయతీల సంబంధిత బ్యాంకు ఖాతాలలో నిధులను జమ చేస్తుంది. దీంతో ఆ మేరకు గ్రామ స్థానిక సంస్థలకు ఆర్ధిక వెసులుబాటు లభించబోతోంది.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గతంలో పెండింగ్ లో పెట్టిన పలు బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకూ మోక్షం కల్పిస్తోంది. తద్వారా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోడీ చూసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు సమర్పిస్తున్న ప్రతిపాదనల మేరకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications