రాజకీయ లబ్ది కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటీషన్ ; షాక్ ఇచ్చిన కేంద్రం
సీబీఐ మాజీ జేడీ వీ.వీ లక్ష్మీనారాయణ కు కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టించడానికి, రాజకీయాలలో సమూలమైన మార్పుల కోసం ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ ఆరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ విలువలతో కూడిన రాజకీయం చేయాలని భావించారు. మొదట పార్టీని పెడతారని అందరూ భావించినప్పటికీ జనసేనలో చేరి విశాఖ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజా సమస్యల విషయంలో స్పందించే లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన ప్రకటనను వ్యతిరేకించారు.
మన దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఉన్నాయని సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, చిన్న చిన్న మార్పులతో లాభాల బాట పట్టించవచ్చు అని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయటంతో పాటు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్రాన్నికోరగా కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది.

ఆ కౌంటర్ లో సీబీఐ మాజీ జేడీ, వీవీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. అసలు ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లుగా అఫిడవిట్లో స్పష్టం చేసింది. వి.వి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుండి గత ఎన్నికలలో పార్లమెంటు స్థానానికి పోటీ చేశారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పిల్ వేసారని అఫిడవిట్లో పేర్కొంది.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేస్తున్న కార్మికులకు అండగా తాను సైతం అంటూ కోర్టు మెట్లెక్కిన వివి లక్ష్మీనారాయణ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశాడు అని చెప్పడం ఆయనకే కాదు ఆయన అభిమానులకు ఒకింత షాక్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications