హైద్రాబాద్‌లో అవమానం, ప్రధానికి చెప్పా: బాబు, మా సాయం కాదు, మీ హక్కు: ఏపీకి జైట్లీ
న్యూఢిల్లీ: ఏపీ - తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తమకు అవమానం జరిగిందని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తమకు అవమానం జరిగిందన్నారు. చట్టంలో సెక్షన్ 8 స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ఇరు ప్రభుత్వాలకు సమాన హక్కులుంటాయని, పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుందన్నారు.
ఏపీ విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదని, కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోటీ పడేస్థాయికి వచ్చే వరకు కేంద్రం సాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా కాకుంటే ఏం ఇస్తారో చెప్పామని తాను కేంద్రాన్ని అడిగానని చెప్పారు. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు లేవన్నారు.

ఏపీ హక్కు: జైట్లీ
ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదని, అది ఆ రాష్ట్ర హక్కు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి అంతా కసరత్తు చేస్తున్నామన్నారు. ఆర్థిక సంక్షోభం తీర్చిదిద్దటం పైనే తమ దృష్టి అన్నారు.
హోదా అయినా ప్యాకేజీ అయినా ఆర్థిక సాయమే అన్నారు. ఏపీకి ఆర్థిక సాయాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని సూచించారు. ఏపీకి ఇచ్చిన హామీలు చట్టబద్దమైననవన్నారు. రాజధానిని కోల్పోయిన ఏపీకి కేంద్రం సాయం చేయడం ఆ రాష్ట్ర హక్కు అన్నారు.
ఏపీకి కేంద్రం మేలు చేయడం లేదని, అది వారి హక్కు మాత్రమేనని చెప్పారు. రాజధాని స్థలం చూస్తే అది ఆదర్శ రాజధాని అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు వంటివి ప్రభుత్వాలే నిర్మిస్తాయన్నారు. ఏపీ రాజధాని అభివృద్ధిలో కీలక పాత్ర ఆ భూమిదే అన్నారు.












Click it and Unblock the Notifications