ఏపీకి మరో బిగ్ న్యూస్ చెప్పిన కేంద్రం-ఈసారి రూ.6280 కోట్లతో..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ పనుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం.. తాజాగా మరో కీలక నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. గతంలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ఇతర పనులకు అంగీకారం తెలిపినా నిధులకు మోక్షం కలగలేదు. దీంతో అవి పెండింగ్ లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో చేపట్టాల్సిన అలాంటి 7 జాతీయ రహదారుల పనులు మొదలుపెట్టేందుకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రానికి గతేడాది కేంద్రం భారత్ మాల పరియోజన ప్రాజెక్టు మొదటిదశలో భాగంగా 384 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది. అయితే టెండర్ల ప్రక్రియకు మాత్రం బ్రేక్ వేసింది. దాన్ని ఇప్పుడు ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.6280 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 7 జాతీయ రహదారుల పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గతంలో ఇవే పనులకు రూ.6646 కోట్లు అవుతుందని అంచనా వేసింది. కానీ తాజాగా దాన్ని రూ.6280 కోట్లకు తగ్గించింది. అయినా పనులు మాత్రం ప్రారంభించాలంటూ రాష్ట్ర ఆర్అండ్ బీ శాఖకు లేఖ రాసింది. దీంతో త్వరలో ఈ పనుల ప్రారంభానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో భారత్ మాల పరియోజన తొలిదశ ప్రాజెక్టులో భాగంగా విస్తరణ చేపట్టే జాతీయ రహదారుల్లో 167, 440, 716జీ, 516బీలో వివిధ పనులు ఉన్నాయి. వీటిలో రెండింటికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. మిగతా వాటికి కూడా త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications