ఏపీలో టోల్ ప్లాజాల దోపిడీ లెక్క తేలింది-ఎన్ని వేల కోట్లో తెలిస్తే షాక్..!
ఏపీలో దాదాపు ప్రతీ 60 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల ద్వారా ఇప్పటివరకూ ఎంత మొత్తం వసూలు చేశారో లెక్క తేలింది. ఇప్పటివరకూ ఎక్కడా కనిపించని ఈ లెక్కను పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ ఈ వివరాలు బయటపెట్టారు. ఏపీలో ప్రస్తుతం 67 టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి.
ఏపీలోని 67 టోల్ ప్లాజాల ద్వారా అవి ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం రూ.22377 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అందులోనూ కీలకమైన జాతీయ రహదారి నంబర్ 16 (కోల్ కతా-చెన్నై) నుంచే ఏకంగా రూ.14550 కోట్లు వసూలు చేసినట్లు గడ్కరీ తెలిపారు. రాష్ట్రంలోని మిగతా రోడ్లతో పోలిస్తే ఈ ఒక్క జాతీయ రహదారిపైనే
వసూలైన మొత్తంలో 65 శాతం వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

రాష్ట్రంలోని జాతీయ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం మొదలుపెట్టాక ఇలా టోల్ ట్యాక్స్ వసూళ్ల కార్యక్రమం మొదలైంది. పీపీపీ విధానంలో కాంట్రాక్టర్లకు రోడ్లను అభివృద్ధి చేసే కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఆ తర్వాత వారు ఖర్చుపెట్టిన మొత్తానికి వడ్డీతో కలిపి వసూలు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించి అప్పటివరకూ వాహనాల నుంచి ఇలా టోల్ ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతోంది. అందులోనూ ఏటికేడాది ఈ లెక్కలు తీసి సదరు రోడ్డుపై ప్రయాణించిన వాహనాల సంఖ్య తక్కువగా ఉంటే అక్కడ టోల్ ట్యాక్స్ పెంచుతున్నారు. ఎక్కువగా ఉంటే తగ్గిస్తున్నారు. ఈ దోపిడీకి భయపడి అవసరం ఉంటే తప్ప జాతీయ రహదారుల్ని ఆశ్రయించే వారే కరవవుతున్నారు.












Click it and Unblock the Notifications